బెంగళూరులో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్‌లో స్థిరమైన ఉద్యోగం.. మంచి జీతం.. భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కెరీర్.. అయినా అతడికి మాత్రం ఆ పని సంతృప్తినివ్వలేదు. అందుకే మూడేళ్ల కార్పొరేట్ జీవితానికి స్వస్తి పలికాడు. ఆ తర్వాత ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కొత్త అవకాశాలను అన్వేషించాడు. చివరకు తనకు ఇష్టమైన పర్యాటక రంగంలో అడుగుపెట్టి సొంత వ్యాపారాన్ని నిర్మించుకున్నాడు. ఇప్పుడు గతంలో ఐటీ ఉద్యోగంలో సంపాదించిన వార్షిక ఆదాయానికి నాలుగైదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నట్లు చెబుతున్నాడు కోల్‌కతాకు చెందిన సోహమ్ చక్రవర్తి. అయితే ఈ ప్రయాణంలో విజయం ఒక్కరోజులో రాలేదు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆయనకు దాదాపు రెండేళ్లు పట్టింది.
నెలల తరబడి డెస్క్‌టాప్‌పై రాజీనామా లేఖ
కెమికల్ ఇంజినీరింగ్ చదివిన సోహమ్ చక్రవర్తి.. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి ఒరాకిల్‌లో చేరాడు. అయితే ఐటీ రంగంలో పనిచేస్తున్న కొద్దీ ఆ ఉద్యోగం తన అభిరుచులకు సరిపడదని గుర్తించాడు. బయటకు వెళ్లిపోవాలనే ఆలోచన వచ్చిన వెంటనే రాజీనామా చేయలేదు. తన నిర్ణయంపై నెలల తరబడి ఆలోచించాడు. చివరకు 2016లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
స్థిరమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టాలన్న అతడి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తొలుత అంత సులభంగా అంగీకరించలేదు. ముఖ్యంగా ఆయన తల్లి చాలా ఆందోళన చెందింది. అయినప్పటికీ, తనకు అర్థవంతమైన జీవితాన్ని అందించే పనిని ఎంచుకోవాలనే ఆలోచనతో సోహమ్ ముందుకెళ్లాడు. తండ్రితో మాట్లాడుతూ.. అవసరమైతే వీధిలో అరటిపండ్లు అమ్ముకుంటానని, కానీ తనకు నచ్చని ఉద్యోగంలో కొనసాగలేనని చెప్పినట్లు ఆయన గుర్తుచేసుకున్నాడు. తండ్రి కూడా బాధ్యతలు మరింత పెరగకముందే కొత్త అవకాశాలను అన్వేషించాలంటూ ప్రోత్సహించాడు.
ఉబెర్ డ్రైవింగ్ నుంచి కొత్త ఆలోచన
2017లో తన స్వస్థలమైన కోల్‌కతాలోని శ్యామ్‌బజార్‌కు తిరిగొచ్చిన సోహమ్.. తర్వాత ఏం చేయాలనే విషయంపై స్పష్టత కోసం దాదాపు ఏడాది పాటు ఉబెర్ డ్రైవర్‌గా పనిచేశాడు. గతంలో చూసిన కార్పొరేట్ జీవితానికి ఈ పని పూర్తిగా భిన్నం. ఆదాయం తక్కువగా ఉండటంతో పాటు శారీరక శ్రమ కూడా ఎక్కువగానే ఉండేది. అయితే ఈ అనుభవం అతడికి నగరాన్ని కొత్త కోణంలో నపరిచయం చేసింది.
క్యాబ్ నడుపుతున్న సమయంలో గతంలో పెద్దగా వెళ్లని ప్రాంతాలను సందర్శించాడు. స్థానికుల జీవనశైలి, చిన్నచిన్న తినుబండారాలు, పాత వీధులు, నగర సంస్కృతిపై అవగాహన పెంచుకున్నాడు. కోల్‌కతాను పర్యాటకులకు కేవలం ప్రసిద్ధ సందర్శనీయ స్థలాలకే పరిమితం చేయకుండా, దాని అసలైన జీవనశైలిని పరిచయం చేయవచ్చనే ఆలోచనకు ఈ అనుభవం పునాది వేసింది.
ఎయిర్‌బీఎన్‌బీ అతిథితో మొదలైన వ్యాపారం
సోహమ్ తల్లిదండ్రులు కోల్‌కతాలో పర్యాటకులకు వసతి కల్పించే ఎయిర్‌బీఎన్‌బీ ఆస్తులను నిర్వహించేవారు. అక్కడికి వచ్చే అతిథులకు నగరాన్ని పరిచయం చేయడంలో సోహమ్ సాయపడేవాడు. ఒకసారి ఓ అతిథి తనతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలను చూపించాలని కోరడంతో అతడు అంగీకరించాడు. అలా మొదలైన సాధారణ నగర సందర్శన క్రమంగా చెల్లింపు ఆధారిత నడక పర్యటనగా మారింది.
అతిథుల నుంచి మంచి స్పందన, సానుకూల సమీక్షలు రావడంతో ఈ సేవకు డిమాండ్ పెరిగింది. దీంతో సోహమ్ ‘కలకత్తా క్యాప్సూల్’ (Calcutta Capsule) పేరుతో హెరిటేజ్ వాకింగ్ టూర్ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. ఈ సంస్థ ద్వారా పర్యాటకులకు కోల్‌కతాలోని చారిత్రక ప్రాంతాలు, పాత వీధులు, స్థానిక సంస్కృతి, ఆహార విశేషాలను దగ్గరగా పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతం నడక పర్యటనలతో పాటు వసతి సేవలను కూడా నిర్వహిస్తున్నాడు.
రెండేళ్ల తర్వాతే ఆర్థిక స్వతంత్రత
ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే సోహమ్ వ్యాపారం లాభాల బాట పట్టలేదు. తన పొదుపు ఎంతకాలం సరిపోతుంది? విద్యార్థి రుణాలు, రోజువారీ ఖర్చులను ఎలా భరించాలి? అనే అంశాలను ముందుగానే లెక్కగట్టి అడుగులు వేశాడు. తనకు దాదాపు రెండేళ్లపాటు జీవన ఖర్చులను భరించేందుకు అవసరమైన పొదుపు ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నాడు.
ఆర్థికంగా తన పొదుపుపై ఆధారపడకుండా స్వతంత్రంగా నిలదొక్కుకోవడానికి రెండేళ్లు పట్టిందని సోహమ్ వెల్లడించాడు. ఇప్పుడు తన పూర్వపు ఐటీ ఉద్యోగంలో పొందిన వార్షిక ఆదాయంతో పోలిస్తే నాలుగైదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నట్లు చెబుతున్నాడు.
ఐటీ అనుభవమే ఇప్పుడు పెట్టుబడి
సోహమ్ తన వ్యాపార నిర్వహణలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు. పర్యటనలు నిర్వహించడంతో పాటు వీడియోల తయారీ, ఎడిటింగ్, వెబ్‌సైట్ నిర్వహణ, మార్కెటింగ్ వంటి పనులను కూడా స్వయంగా చూసుకుంటున్నాడు. ఐటీ రంగంలో నేర్చుకున్న నైపుణ్యాలు ఇప్పుడు తన సృజనాత్మక ఆలోచనలను వ్యాపారంగా మార్చడానికి ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నాడు. తాజా మీడియా కథనాల ప్రకారం.. ఇప్పటివరకు 4,000 మందికి పైగా అతిథులకు ఆతిథ్యం ఇచ్చిన సోహమ్.. వారిలో 2,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలిపాడు.
ఇతరులకు ఆయన ఇచ్చే సందేశం ఒక్కటే.. ఉద్యోగంలో సంతృప్తి లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం తప్పు కాదు. అయితే కేవలం అభిరుచి ఉందనే కారణంతో ఉద్యోగాన్ని వదిలేయడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయం. కొత్తగా చేపట్టే పనికి ఆదాయ అవకాశాలు ఉన్నాయా? ఆర్థిక అవసరాలను ఎలా తీర్చుకోవాలి? ఎంతకాలం ఆదాయం లేకుండా కొనసాగగలం? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.


