
న్యూఢిల్లీ: పాదచారులు, వాహనదార్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కుల్లాంటి వాహనాల్లో ఎకూస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టం (ఏవీఏఎస్)ను అమలు చేయాలని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ ప్రతిపాదించింది. 2026 అక్టోబర్ తర్వాత కొత్తగా తయారు చేసే అన్ని ఎలక్ట్రిక్ ప్యాసింజర్, గూడ్స్ వాహనాల్లో దీన్ని తప్పనిసరిగా అమర్చాలని ఒక ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అలాగే ప్రస్తుత మోడల్స్ విషయంలో అక్టోబర్ 1 నాటికి ఎం, ఎన్ కేటగిరీ వాహనాల్లో ఏవీఏఎస్‌ను అమర్చాలని ప్రతిపాదించింది. ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లు, బస్సులను కేటగిరీ ఎం వాహనాలుగా, విద్యుత్ గూడ్స్.. ట్రక్కులను కేటగిరీ ఎన్ వాహనాలుగా పరిగణిస్తారు. దాదాపు నిశ్శబ్దంగా పరుగులు తీసే ఎలక్ట్రిక్ వాహనం ఉనికి గురించి పాదచారులు, ఇతరత్రా వాహనదారులను అలర్ట్ చేసేందుకు, ఇంజిన్ శబ్దాన్ని వెలువరించేలా ఈ సిస్టం ఉంటుంది. అమెరికా, జపాన్‌తో పాటు కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే హైబ్రిడ్ వాహనాల్లో ఏవీఏఎస్‌ని తప్పనిసరి చేశాయి.