breaking news
Hybrid vehicles
-
ఈవీలకు ‘హైబ్రిడ్’ దన్ను
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలతో హైబ్రిడ్ వాహనాలు పోటీపడటం కాకుండా వాటి విక్రయాలకు ఇతోధికంగా దోహదపడుతున్నాయని హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. ఈ రెండు రకాల కస్టమర్ల సెగ్మెంట్లు వేర్వేరుగా ఉంటున్నాయని పేర్కొంది. భారత్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లే క్రమంలో.. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే హైబ్రిడ్లు, సీఎన్జీలు, బయోఇంధనాలతో నడిచే వాహనాలకు ప్రాధాన్యం కొనసాగుతుందని వివరించింది. ‘స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎస్హెచ్ఈవీ), బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ) ఒకదాని మార్కెట్‌ను మరొకటి ఆక్రమించకుండా, వేర్వేరు వర్గాల కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా ఉంటున్నాయి. ఎస్హెచ్ఈవీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న రాష్ట్రాల్లో బీఈవీల అమ్మకాలు కూడా పటిష్ట వృద్ధిని సాధించాయి. దేశంలోనే అత్యధికంగా ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్హెచ్ఈవీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచి్చనప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్ఈవీ విక్రయాలకు సరిసమాన స్థాయిలో ఈవీల అమ్మకాల వృద్ధి నమోదైంది. ఎస్హెచ్ఈవీల విక్రయాలు, బీఈవీల అమ్మకాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని ఈ ధోరణితో తెలుస్తోంది‘ అని నివేదిక వివరించింది. ఎస్హెచ్ఈవీలను ప్రోత్సహిస్తే, ఈవీల విక్రయాలు తగ్గిపోతాయనేది అపోహ మాత్రమేనని తెలిపింది. కొత్త మోడల్స్ రాకతో గత ఆరు నెలల్లో ఈవీల వినియోగం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది.మరిన్ని ముఖ్యాంశాలు.. → గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1.9 శాతంగా ఉన్న ఫోర్ వీలర్ ఈవీల విక్రయాలు, ఆఖరు త్రైమాసికంలో 2.5 శాతానికి పెరిగాయి. → మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో (పీవీ) ఎస్హెచ్ఈవీల వాటా 2025 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 2.1 శాతంగా ఉంది. → ధరకు తగ్గ విలువను అందించే విధంగా ఉంటే ఈవీలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు సుముఖంగానే ఉంటున్నారు. విండ్సర్ కస్టమర్లు 7–8 ఏళ్ల తర్వాత బ్యాటరీ రీప్లేస్మెంట్ వ్యయం గురించి ఆందోళన చెందకుండా ఎంజీ సంస్థ లీజింగ్ ఆప్షన్లను ప్రవేశపెట్టడం, రేంజి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఎంఅండ్ఎం తమ బీఈవీల్లో భారీ బ్యాటరీని అందించడం మొదలైనవి సానుకూలాంశాలుగా ఉన్నాయి. → మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్), టయోటా కిర్లోస్కర్ కంపెనీలు ప్రవేశపెట్టిన ఎస్హెచ్ఈవీలు 2023 అలాగే 2024 ఆర్థిక సంవత్సరాల్లో డీజిల్ వేరియంట్ల మార్కెట్ వాటాను ఆక్రమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో డీజిల్ వేరియంట్లు, హైబ్రిడ్ల వాటా స్థిరంగా నమోదైంది. → కొత్త మోడల్స్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సమీప భవిష్యత్తులో హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరిగేందుకు దోహదపడనున్నాయి. -
ప్రీమియం వాహనాల వైపు మొగ్గు
న్యూఢిల్లీ: వాహనాల కొనుగోలుదార్లు విలాసవంతమైన, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే హైబ్రిడ్ వాహనాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దేశీ ఆటోమోటివ్ పరిశ్రమపై గ్రాంట్ థార్న్టన్ భారత్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో పాల్గొన్న వారిలో 85 శాతం మంది ప్రీమియం మోడల్స్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 40 శాతం మంది హైబ్రిడ్ వాహనాలను ఇష్టపడుతుండగా, 17 శాతం మంది మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపారు. 34 శాతం మంది పెట్రోల్ వాహనాలకు ప్రాధాన్యమిస్తున్నారు.వినియోగదారులు మరింత భారీ ఈవీ మౌలిక సదుపాయాలు... ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తూనే పర్యావరణ అనుకూల ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నారనే ధోరణి వల్లే హైబ్రిడ్ వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో మారుతున్న వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా రాణించేలా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ సొల్యూషన్స్‌పై వాహనాల తయారీ సంస్థలు దృష్టి పెట్టాల్సిన ఉంటుందని పేర్కొంది. కీలకంగా పండుగ సీజన్... వార్షిక అమ్మకాల్లో దాదాపు 30–40 శాతం వాటా పండుగ సీజన్ విక్రయాలే ఉంటాయి కాబట్టి దేశీ ఆటోమోటివ్ పరిశ్రమకు ఇది కీలకమైన సీజన్ అని సర్వే తెలిపింది. అయితే, నిల్వలు భారీగా పేరుకుపోవడం, వాతావరణ మార్పులపరమైన అవాంతరాలు, ఎన్నికలు మొదలైనవి ఈసారి అమ్మకాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా చెప్పారు. యుటిలిటీ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు నెలకొన్న డిమాండే.. మార్కెట్‌ను ముందుకు నడిపిస్తోందన్నారు.‘‘ఈ సెగ్మెంట్స్ వార్షికంగా 13 శాతం వృద్ధి నమోదు చేశాయి. ప్రస్తుతం ప్యాసింజర్ వాహనాల (పీవీ) విభాగంలో వీటి వాటా 65 శాతంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీ విక్రయాలు కేవలం 0.5 శాతం పెరిగి ఒక మోస్తరు వృద్ధిని మాత్రమే నమోదు చేసినప్పటికీ ఎస్‌యూవీలు, యూవీలకు డిమాండ్ నిలకడగా కొనసాగడం ప్రత్యేకమైన వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండటాన్ని తెలియజేస్తోంది’’ అని మెహ్రా వివరించారు. సవాలుగా నిల్వలు.. వాహన నిల్వలు గణనీయంగా పేరుకుపోవడం పరిశ్రమకు సవాలుగా మారింది. రూ.79,000 కోట్ల విలువ చేసే 7.9 లక్షల యూనిట్ల స్థాయిలో నిల్వలు పేరుకుపోయినట్లు మెహ్రా వివరించారు. భారీగా పండుగ డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంపై ఆటోతయారీ సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు. దాదాపు 90 శాతం మంది ఈ తరహా ఆఫర్లు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, కంపెనీలు ప్రకటిస్తున్న సబ్‌్రస్కిప్షన్ విధానాలకు, అలాగే వివిధ కార్ మోడల్స్‌లో మరిన్ని భద్రతా ఫీచర్లకు కూడా డిమాండ్ పెరుగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఇక కొనుగోలుదారులు డిజైన్ లేదా పనితీరు వంటి అంశాలకు మించి అధునాతన భద్రతా ఫీచర్ల వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. -
వచ్చే ఏడాదే జాగ్వార్ ఎలక్ట్రిక్ కారు
సాక్షి, అమరావతి : భారత రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలతో పరుగులెత్తడానికి కంపెనీలు పోటీలు పడుతున్న తరుణంలో... వచ్చే ఏడాది నుంచి వరసగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను మార్కెట్లోకి తేనున్నట్లు టాటా మోటార్స్ అనుబంధ సంస్థ, అంతర్జాతీయ దిగ్గజం ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్’ ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ప్రారంభంలో ‘ఐ–పేస్’ పేరిట ఎలక్ట్రిక్ ఫైవ్ స్టార్ స్పోర్ట్స్ కారును విడుదల చేయనున్నట్లు జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి జేఎల్ఆర్ షోరూమ్‌ను ప్రారంభించడానికి అమరావతికి వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశీయ లగ్జరీ కార్ల పరిశ్రమలో కూడా వేగంగా పాగా వేస్తున్నట్లు చెప్పిన రోహిత్ సూరి... జీఎస్టీ భారం నుంచి ఎలక్ట్రిక్ కార్ల దాకా పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ... జీఎస్టీ వల్ల లగ్జరీ కార్లపై పన్ను భారం తగ్గింది. కానీ సెప్టెంబర్‌లో మళ్లీ సెస్సు వేశారు. దీన్ని ఎలా చూస్తున్నారు? పన్ను ఎంత ఎక్కువైనా అది స్థిరంగా ఉండాలి. తరచు మార్చకూడదు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే రేట్లు మార్చడం మార్కెట్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా కార్ల వంటి భారీ వస్తువుల్ని తయారు చేసే కంపెనీలు ఏడాదికి ఎన్ని అమ్ముడవుతాయి? మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎంత పెట్టుబడి పెట్టాలి? అనే అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటాయి. జీఎస్టీకి వీలుగా 6–8 నెలల ముందే ప్లాన్ చేసుకున్నాం. మళ్లీ ఇప్పుడు రేట్లు మార్చడంతో మా ప్రణాళికలన్నింటినీ పునఃసమీక్షించాల్సి వచ్చింది. ఇది పరిశ్రమనే కాదు.. వినియోగదారుడిని కూడా గందరగోళానికి గురి చేస్తోంది. ఇవే రేట్లు కొనసాగుతాయా లేక తగ్గుతాయా... పెరుగుతాయో అనేది కస్టమర్లకు అర్థం కావటం లేదు. జీఎస్టీ వచ్చాక లగ్జరీ కార్ల అమ్మకాల్లో మంచి వృద్ధి కనిపించింది. సెప్టెంబర్ నుంచి సెస్ పెంచడంతో కార్ల ధరలను 3 నుంచి 5 శాతం పెంచాల్సి వచ్చింది. దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ ఎలా ఉంది? పరిమాణం పరంగా దేశీ లగ్జరీ కార్ల మార్కెట్ చాలా చిన్నది. రూ.30,000 కోట్లు మాత్రమే. ప్రస్తుతం దేశంలో మెర్సిడెజ్, ఆడి , బీఎండబ్ల్యూ, జేఎల్ఆర్ వంటి లగ్జరీ బ్రాండ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి దేశీ లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా విస్తరించడానికి అనేక అవకాశాలున్నాయి. ఈ ఏడాది 15–16 శాతం వృద్ధితో పరిశ్రమ పరిమాణం రూ.35,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నాం. జేఎల్ఆర్ మాత్రం సగటు మార్కెట్ వృద్ధి కన్నా ఎక్కువే పెరుగుతోంది. ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే 45 శాతం వృద్ధితో సుమారు 3,000 యూనిట్లను విక్రయించాం. జీఎస్టీలో సెస్ పెంచాక ఈ వృద్ధి కొద్దిగా తగ్గినా ఇదే వృద్ధిరేటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ కార్లవైపు చూస్తోంది. మరి మీరు? అంతర్జాతీయంగా ఎలక్ట్రికల్ కార్లను విడుదల చేయడానికి జేఎల్ఆర్ సర్వం సిద్ధం చేసుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే తొలి ఎలక్ట్రిక్ హైబ్రీడ్ కారు ‘ఐ–పేస్’ను అంతర్జాతీయ మార్కెట్లోకి తెస్తున్నాం. ఈ కారు ఇండియాలో పరుగులు పెట్టడానికి మరి కొన్నాళ్లు వేచి చూడకతప్పదు. ఇక్కడ ఇంకా ఎలక్ట్రిక్ కార్లు తిరగడానికి కావాల్సిన మౌలిక వసతులు లేవు. దేశవ్యాçప్తంగా చార్జింగ్ పాయిం ట్లు ఏర్పాటు చేయడమనేది పెద్ద సమస్య. ఐ–పేస్ తర్వాత వరుసగా అనేక ఎలక్ట్రిక్, హైబ్రీడ్, ప్లగిన్ హైబ్రీడ్ కార్లు అంతర్జాతీయంగా విడుదల చేస్తాం. మార్కెట్ పెరుగుతోంది కదా! పుణే ప్లాంటును విస్తరిస్తారా? పుణేలో 2011లో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 6 మోడల్స్‌ను విడుదల చేశాం. కొత్త మోడల్స్ విడుదల అనేది అమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అమ్మకాలు తక్కువగా ఉంటే కొత్త మోడల్స్ విడుదల ఆలస్యమవుతుంది. ప్రస్తుతం పుణే యూనిట్‌కు మూడు నుంచి నాలుగేళ్ల డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేసే సామర్థ్యం ఉండటంతో విస్తరణ దిశగా ఎలాంటి ఆలోచనలూ చేయటం లేదు. షోరూంల నెట్‌వర్క్‌ను విస్తరించే ఆలోచనలేమైనా ఉన్నాయా? ఏటా రెండు నుంచి మూడు కొత్త షోరూంలను ఏర్పాటు చేయాలన్నది మా ప్రణాళిక. అమరావతిలో విశాలంగా అత్యంత ఆధునికమైన షోరూంను ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా మా షోరూంల సంఖ్య ఇప్పుడు 26కు చేరింది. వచ్చే మార్చిలోగా మరో రెండు షోరూంలను ఏర్పాటు చేస్తాం. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కొత్త షోరూంలను ఏర్పాటుచేసే ఆలోచన అయితే లేదు. -
హైబ్రీడ్ వాహనాలపై టయోటాతో సీఎం చర్చలు
సాక్షి, అమరావతి: రాజధానిలో హైబ్రీడ్ వాహనాల ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం చంద్రబాబు టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ ప్రతినిధులను కోరారు. శనివారం చంద్రబాబును కలసిన కిర్లోస్కర్ కంపెనీ ఎండీ అకిటొ టచిబనతో కూడిన ప్రతినిధి బృందం హైబ్రీడ్ వాహనాలపై ప్రజెంటేషన్ ఇచ్చింది. బ్యాటరీలతో నడిచే ఈ వాహనాలను విద్యుత్‌తో చార్జ్ చేసుకోవాలి. చార్జింగ్ లేని సమయంలో ఇంజన్‌తో నడిచేలా ఈ వాహనాలను తయారు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో ప్రాజెక్టును ప్రారంభించేందుకు పనులు ప్రారంభించాలని సీఎం కోరారు. రాజధాని అమరావతిలో భవిష్యత్తు రవాణా అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. త్వరలో దీనిపై ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించారు.