వచ్చే ఏడాదే జాగ్వార్‌ ఎలక్ట్రిక్‌ కారు | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదే జాగ్వార్‌ ఎలక్ట్రిక్‌ కారు

Published Sat, Nov 25 2017 1:14 AM

JLR India President  MD Rohit Suri Interview - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, అమరావతి : 
భారత రోడ్లపై ఎలక్ట్రిక్‌ వాహనాలతో పరుగులెత్తడానికి కంపెనీలు పోటీలు పడుతున్న తరుణంలో... వచ్చే ఏడాది నుంచి వరసగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాలను మార్కెట్లోకి తేనున్నట్లు టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ, అంతర్జాతీయ దిగ్గజం ‘జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌’ ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ప్రారంభంలో ‘ఐ–పేస్‌’ పేరిట ఎలక్ట్రిక్‌ ఫైవ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ కారును విడుదల చేయనున్నట్లు జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్,  ఎండీ రోహిత్‌ సూరి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి జేఎల్‌ఆర్‌ షోరూమ్‌ను ప్రారంభించడానికి అమరావతికి వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశీయ లగ్జరీ కార్ల పరిశ్రమలో కూడా వేగంగా పాగా వేస్తున్నట్లు చెప్పిన రోహిత్‌ సూరి... జీఎస్‌టీ భారం నుంచి ఎలక్ట్రిక్‌ కార్ల దాకా పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ...

జీఎస్‌టీ వల్ల లగ్జరీ కార్లపై పన్ను భారం తగ్గింది. కానీ సెప్టెంబర్లో మళ్లీ సెస్సు వేశారు. దీన్ని ఎలా చూస్తున్నారు?
పన్ను ఎంత ఎక్కువైనా అది స్థిరంగా ఉండాలి. తరచు మార్చకూడదు. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే రేట్లు మార్చడం మార్కెట్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా కార్ల వంటి భారీ వస్తువుల్ని తయారు చేసే కంపెనీలు ఏడాదికి ఎన్ని అమ్ముడవుతాయి? మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎంత పెట్టుబడి పెట్టాలి? అనే అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటాయి. జీఎస్‌టీకి వీలుగా 6–8 నెలల ముందే ప్లాన్‌ చేసుకున్నాం. మళ్లీ ఇప్పుడు రేట్లు మార్చడంతో మా ప్రణాళికలన్నింటినీ పునఃసమీక్షించాల్సి వచ్చింది. ఇది పరిశ్రమనే కాదు.. వినియోగదారుడిని కూడా గందరగోళానికి గురి చేస్తోంది. ఇవే రేట్లు కొనసాగుతాయా లేక తగ్గుతాయా... పెరుగుతాయో అనేది కస్టమర్లకు అర్థం కావటం లేదు. జీఎస్‌టీ వచ్చాక లగ్జరీ కార్ల అమ్మకాల్లో మంచి వృద్ధి కనిపించింది. సెప్టెంబర్‌ నుంచి సెస్‌ పెంచడంతో కార్ల ధరలను 3 నుంచి 5 శాతం పెంచాల్సి వచ్చింది. 

దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్‌ ఎలా ఉంది?
పరిమాణం పరంగా దేశీ లగ్జరీ కార్ల మార్కెట్‌ చాలా చిన్నది. రూ.30,000 కోట్లు మాత్రమే. ప్రస్తుతం దేశంలో మెర్సిడెజ్, ఆడి , బీఎండబ్ల్యూ, జేఎల్‌ఆర్‌ వంటి లగ్జరీ బ్రాండ్‌లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి దేశీ లగ్జరీ కార్ల మార్కెట్‌ వేగంగా విస్తరించడానికి అనేక అవకాశాలున్నాయి. ఈ ఏడాది 15–16 శాతం వృద్ధితో పరిశ్రమ పరిమాణం రూ.35,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నాం. జేఎల్‌ఆర్‌ మాత్రం సగటు మార్కెట్‌ వృద్ధి కన్నా  ఎక్కువే పెరుగుతోంది. ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే 45 శాతం వృద్ధితో  సుమారు 3,000 యూనిట్లను విక్రయించాం. జీఎస్‌టీలో సెస్‌ పెంచాక ఈ వృద్ధి కొద్దిగా తగ్గినా ఇదే వృద్ధిరేటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం.

ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రిక్‌ కార్లవైపు చూస్తోంది. మరి మీరు?
అంతర్జాతీయంగా ఎలక్ట్రికల్‌ కార్లను విడుదల చేయడానికి  జేఎల్‌ఆర్‌ సర్వం సిద్ధం చేసుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే తొలి ఎలక్ట్రిక్‌ హైబ్రీడ్‌ కారు ‘ఐ–పేస్‌’ను అంతర్జాతీయ మార్కెట్లోకి తెస్తున్నాం. ఈ కారు ఇండియాలో పరుగులు పెట్టడానికి మరి కొన్నాళ్లు వేచి చూడకతప్పదు. ఇక్కడ ఇంకా ఎలక్ట్రిక్‌ కార్లు తిరగడానికి కావాల్సిన మౌలిక వసతులు లేవు. దేశవ్యాçప్తంగా చార్జింగ్‌ పాయిం ట్లు ఏర్పాటు చేయడమనేది పెద్ద సమస్య. ఐ–పేస్‌ తర్వాత వరుసగా అనేక ఎలక్ట్రిక్,  హైబ్రీడ్, ప్లగిన్‌ హైబ్రీడ్‌ కార్లు అంతర్జాతీయంగా విడుదల చేస్తాం.

మార్కెట్‌ పెరుగుతోంది కదా! పుణే ప్లాంటును విస్తరిస్తారా?
పుణేలో 2011లో అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 6 మోడల్స్‌ను విడుదల చేశాం. కొత్త మోడల్స్‌ విడుదల అనేది అమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అమ్మకాలు తక్కువగా ఉంటే కొత్త మోడల్స్‌ విడుదల ఆలస్యమవుతుంది. ప్రస్తుతం పుణే యూనిట్‌కు మూడు నుంచి నాలుగేళ్ల డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేసే సామర్థ్యం ఉండటంతో విస్తరణ దిశగా ఎలాంటి ఆలోచనలూ చేయటం లేదు.

షోరూంల నెట్‌వర్క్‌ను విస్తరించే ఆలోచనలేమైనా ఉన్నాయా?
ఏటా రెండు నుంచి మూడు కొత్త షోరూంలను ఏర్పాటు చేయాలన్నది మా ప్రణాళిక. అమరావతిలో విశాలంగా అత్యంత ఆధునికమైన షోరూంను ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా మా షోరూంల సంఖ్య ఇప్పుడు 26కు చేరింది. వచ్చే మార్చిలోగా మరో రెండు షోరూంలను ఏర్పాటు చేస్తాం. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కొత్త షోరూంలను ఏర్పాటుచేసే ఆలోచన అయితే లేదు. 

Advertisement
 
Advertisement
 
Advertisement