
చట్టబద్ధమైన రియల్ మనీ గేమ్స్ (ఆర్‌ఎంజీ) అన్నింటిని భారత్‌లోని తమ ప్లేస్టోర్‌లో అనుమతించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ ప్రతిపాదన చేసింది.
ఎంపిక చేసిన నిర్దిష్ట డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (డీఎఫ్‌ఎస్), రమ్మీ యాప్‌లకు మాత్రమే ప్లేస్టోర్‌లో చోటు కల్పించే ప్రయోగాత్మక ప్రోగ్రాంను నిలిపివేసే విధంగా ఇది ఉండనుంది. మరోవైపు, నైపుణ్యాల ఆధారిత గేమ్స్‌ను ప్రమోట్ చేసేందుకు వీలుగా తమ యాడ్ పాలసీలో కూడా మార్పులు చేసే యోచన ఉన్నట్లు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కి గూగుల్ తెలిపింది.
మార్కెట్లో పోటీని దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందన్న విన్‌జో గేమ్స్ ఫిర్యాదుపై సీసీఐ విచారణ చేపట్టిన నేపథ్యంలో గూగుల్ ఈ మేరకు ప్రతిపాదన చేసింది. దీనిపై ఆగస్టు 20 లోపు సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది.