నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న తరుణంలో నాలుగు రెట్ల జీతమా..!

Google Paid 4 Times More To retain Employee - Sakshi

Google Paid 4 Times More : పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ మారుతున్న ఉద్యోగిని నిలుపుకొనేందుకు ఓ టెక్‌ దిగ్గజం గూగుల్‌ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సిద్ధమైంది. టెక్‌ పరిశ్రమలో లేఆఫ్‌ల పేరుతో వేలాది మందిని తొలగిస్తున్నప్పటికీ ప్రతిభా, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని చెప్పేందుకు ఇదే ఉదాహరణ.

సెర్చ్ ఇంజన్ పెర్‌ప్లెక్సిటీ AI సీఈవో అరవింద్ శ్రీనివాస్ తాను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగి వేతనాన్ని గూగుల్ ఎలా నాలుగు రెట్లు పెంచిందో చెప్పారు. బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్ హోస్ట్ అలెక్స్ కాంట్రోవిట్జ్‌తో సంభాషణలో శ్రీనివాస్ ఇలా అన్నారు.. “నేను గూగుల్ నుండి రిక్రూట్ చేయడానికి ప్రయత్నించిన ఒక అద్భుతమైన అభ్యర్థి ఉన్నాడు. అతను ఇప్పటికీ గూగుల్‌ సెర్చ్‌ బృందంలో పనిచేస్తున్నాడు. మా కంపెనీలో చేరబోతున్నాడని అతను వారికి చెప్పగానే వారు (గూగుల్) అతని ఆఫర్‌ను నాలుగు రెట్లు పెంచారు. నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’’ అన్నారు. 

ప్రతిభను నిలుపుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సంఘటన తెలియజేస్తోంది. వారి సంభాషణలో కాంట్రోవిట్జ్ శ్రీనివాస్‌ను టెక్ కంపెనీలు ఎందుకు చాలా మందిని తొలగిస్తున్నాయో మీకు తెలుసా అని అడిగారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ.. కంపెనీలు ఎలాంటివారిని తొలగిస్తున్నాయో తనకు తెలియదన్నారు. ఇది పనితీరుపై ఆధారపడి ఉందా లేదా మరేదైనా అన్నదాని తనకు స్పష్టమైన అవగాహన లేదన్నారు.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) లో పోస్ట్‌ చేసిన ఈ సంభాషణపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. "ఆ ఇంజనీర్‌కు చాలా తెలుసు" అని ఓ యూజర్‌ చమత్కరించారు. "మీకు ఇంటర్నల్‌ హైక్‌ కావాలంటే KRAని పూరించాల్సిన అవసరం లేదు మరొక కంపెనీకి అప్లయి చేసుకుంటే సరిపోతుంది" అని మరో యూజర్‌ సూచించారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top