డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్! | Google challenging US court ruling that requires share search data | Sakshi
Sakshi News home page

డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!

Jan 18 2026 11:58 AM | Updated on Jan 18 2026 12:05 PM

Google challenging US court ruling that requires share search data

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు, అమెరికా న్యాయస్థానాలకు మధ్య జరుగుతున్న ‘గుత్తాధిపత్య’ పోరు కొత్త మలుపు తిరిగింది. తమ సెర్చ్ డేటాను చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వంటి ప్రత్యర్థి సంస్థలతో పంచుకోవాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ గూగుల్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. అప్పీలుపై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ డేటా బదిలీని వాయిదా వేయాలని కంపెనీ కోరింది.

తీర్పు నేపథ్యం ఏమిటి?

ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని 2024లో వాషింగ్టన్ డిస్ట్రిక్ట్‌ న్యాయమూర్తి అమిత్ మెహతా చారిత్రాత్మక తీర్పునిచ్చారు. యాపిల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలకు ఏటా 20 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించి, గూగుల్‌ను ‘డిఫాల్ట్’ సెర్చ్ ఇంజిన్‌గా ఉంచడం ద్వారా పోటీని అణచివేసిందని కోర్టు నిర్ధారించింది. ఈ ఆధిపత్యాన్ని తగ్గించే క్రమంలో గూగుల్ తన సెర్చ్ డేటాను ప్రత్యర్థులకు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.

గూగుల్ వాదన ఏంటి?

అప్పీలు పెండింగ్‌లో ఉండగానే డేటాను పంచుకుంటే కంపెనీకి చెందిన కీలక వాణిజ్య రహస్యాలు ప్రత్యర్థుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రజలు గూగుల్‌ను బలవంతంగా కాకుండా, మంచి సేవలు అందిస్తుంది కాబట్టే వాడుతున్నారు’ అని గూగుల్ రెగ్యులేటరీ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ లీ-అన్నే ముల్హోలాండ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మార్కెట్‌లో గట్టి పోటీ ఉందని, కోర్టు నిర్ణయం ఆవిష్కరణల స్థాయిని తక్కువ అంచనా వేసిందని కంపెనీ వాదిస్తోంది.

షరతులకు అంగీకారం.. కానీ!

గోప్యత, భద్రతా రక్షణలకు సంబంధించిన నిబంధనలను పాటించడానికి సిద్ధమని గూగుల్ తెలిపింది. అయితే డేటా షేరింగ్, సిండికేటెడ్ ఫలితాలు, ప్రకటనల పంపిణీ విషయంలో మాత్రమే స్టే కోరుతోంది.

ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement