
విదేశాల నుంచి తగ్గిన బంగారం స్మగ్లింగ్
2023–24ల్లో 240 కేసులు నమోదు
గత ఆర్థిక సంవత్సరం ఇది 133కు తగ్గుదల
కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడమే కారణం
గణనీయంగా పెరిగిన సిగరెట్ల అక్రమ రవాణా
మూడు రెట్లు అధికంగా వీటి సంబంధిత కేసులు
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల నుంచి అక్రమ రవాణా అవుతున్న బంగారానికి సంబంధించి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు 2023–24 ఆర్థిక సంవత్సరంలో 240 కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి 132.4 కేజీల పసిడి స్వాధీనం చేసుకున్నారు. 2024–25 నాటికి కేసుల సంఖ్య 133కి, సీజ్ చేసిన బంగారం 42.5 కేజీలకు తగ్గిపోయింది. కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీని 15 నుంచి ఆరు శాతానికి తగ్గిండచమే దీనికి కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో సిగరెట్ల అక్రమ రవాణా మాత్రం గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రధానంగా ఆ దేశాల నుంచే..
దుబాయ్ హవాలా రాకెట్లతో పాటు ఇప్పుడు బంగారం అక్రమ రవాణాకూ కేంద్రంగా మారిపోయింది. దీంతో పాటు జెద్దా, మస్కట్, కువైట్, బహ్రేన్ నుంచి స్మగ్లింగ్ అవుతుంటుంది. ఆయా దేశాల్లో ఆదాయపు పన్ను విధానం లేకపోవడంతో మనీలాండరింగ్ అనేదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడ నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపే స్మగ్లర్లు దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకు వస్తుంటారు.
గరిష్టంగా ఏడు శాతం తక్కువ రేటు..
ప్రస్తుతం నగరంలో 24 క్యారెట్ల బంగారం కేజీ రూ.కోటి వరకు పలుకుతోంది. ఆయా దేశాల్లో దీని ఖరీదు ఐదు నుంచి ఏడు శాతం తక్కువగా ఉంటుంది. కేజీ బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి సూత్రధారులు రూ.7 లక్షల వరకు ఖర్చు చేస్తారు. గతంలో విదేశాల నుంచి తీసుకువచ్చే బంగారంపై 15 శాతం ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆరు శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విదేశాల నుంచి అక్రమ రవాణా చేసి తీసుకువచ్చినా, నేరుగా తీసుకువచ్చినా వచ్చే లాభంలో పెద్ద తేడా లేకపోవడంతో స్మగ్లింగ్ గణనీయంగా తగ్గింది.
సిగరెట్లకు భారీగా పెరిగిన డిమాండ్..
బంగారం, ఎల్రక్టానిక్ వస్తువులు, మాదకద్రవ్యాలు... అక్రమ రవాణా పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. అయితే సిగరెట్లు కూడా పెద్ద సంఖ్యలో స్మగ్లింగ్ అవుతున్నాయి. 2023–24లో కేవలం 54 కేసులు నమోదు కాగా... గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య 175కు చేరింది. హైదరాబాద్ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో రెండు బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
