
న్యూఢిల్లీ: జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద పసిడి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి మంగళవారం కొత్త గరిష్ట స్థాయి రూ.1,15,100 స్థాయికి చేరుకోగా.. బుధవారం రూ.1,300 నష్టపోయి రూ.1,13,800కు పరిమితమైంది. ధరలు తగ్గుముఖం పట్టడంతో.. సేల్స్ పెరిగాయి.
‘‘యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మెగ్గు చూపించడంతో బంగారం బలహీనంగా ట్రేడయ్యింది. కీలకమైన సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకున్నారు. కేవలం ఫెడ్ రేట్ల కోతపైనే కాకుండా, తదుపరి రేట్ల సవరణ దిశగా ప్రకటించే అంచనాల కోసం మార్కెట్లు వేచి చూస్తున్నాయి.
ఇదీ చదవండి: కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటు
తటస్థ విధానం లేదా తదుపరి రేట్ల కోతకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ లోపిస్తే బంగారం ధరలు ఇక్కడి నుంచి కొంత శాతం తగ్గొచ్చు’’అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. మరోవైపు వెండి సైతం అమ్మకాల ఒత్తిడితో కిలోకి రూ.1,670 నష్టపోయి రూ.1,31,200 స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు ఒక శాతం తగ్గి 3,665 డాలర్ల వద్ద, కామెక్స్ ఫ్యూచర్స్‌లో పావు శాతం తగ్గి 3,717 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.