న్యూఢిల్లీ: అమెరికా కరెన్సీ డాలర్ దిగిరావడంతో దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు రెండో రోజూ పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం... 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 లాభపడి రూ.1,54,400 వద్ద ముగిసింది. గడిచిన 2 సెషన్ల ర్యాలీతో పసిడి రూ.4,600 కోలుకోవడం విశేషం. మరోవైపు, కిలో వెండి ధర కూడా రూ.4,500 పెరిగి రూ.2,28,500కి చేరింది.
‘ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ... ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి డాలర్ సూచీ తగ్గడం పసిడికి మద్దతుగా నిలిచింది. అయితే, డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత కొనసాగుతుండటం వల్ల మన దేశంలో పసిడి, వెండి దిగుమతి వ్యయం మరింత భారమవుతోంది’ అని బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ ‘లెమన్’ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 48.35 డాలర్లు (1.17%) పెరిగి 4,182 డాలర్లకు చేరింది. వెండి 2% కోలుకుని 60.3 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.


