బంగారం రూ.2 లక్షలు దాటుతుందా.. ఎప్పుడు? | Gold Price To Hit Rs 2 Lakh Per 10 Grams, JPMorgan Forecasts Sharp Rise In Gold Prices, More Details Inside | Sakshi
Sakshi News home page

బంగారం రూ.2 లక్షలు దాటుతుందా.. ఎప్పుడు?

Jun 19 2026 8:50 AM | Updated on Jun 19 2026 10:29 AM

Gold Price to Hit Rs 2 Lakh per 10 Grams JPMorgan Forecast

బంగారం ధరలు మరోసారి భారీ ఎత్తున పెరిగే అవకాశాలపై అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రముఖ పెట్టుబడి బ్యాంక్ జేపీ మోర్గాన్‌ చేస్‌ (JPMorgan Chase) తాజాగా విడుదల చేసిన నివేదికలో 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్స్‌కు 6,000 డాలర్లకు, 2027 నాటికి 6,300 డాలర్లకు చేరే అవకాశముందని పేర్కొంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయిల కంటే తక్కువగా ట్రేడవుతున్నప్పటికీ, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, అమెరికా ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి దీర్ఘకాలంలో బంగారానికి మద్దతుగా నిలుస్తాయని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది.

ఈ అంచనాలు నిజమైతే భారతీయ మార్కెట్లో బంగారం ధరలు చరిత్రాత్మక స్థాయికి చేరే అవకాశం ఉంది. డాలర్ మారకపు విలువ, దిగుమతి సుంకాలు, సెస్సులు, జీఎస్టీ వంటి పన్నులను పరిగణనలోకి తీసుకుంటే 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షల మార్కును దాటవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత ధరలతో పోలిస్తే ఇది సుమారు 30–40 శాతం వరకు పెరుగుదల అవుతుంది.

5,000 డాలర్లే ఎక్కువ
అయితే అందరు విశ్లేషకులు ఇదే అభిప్రాయంలో లేరు. ఇటీవల బంగారం ధరలు కొంత బలహీనత చూపుతున్నాయని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, డాలర్ బలం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపవచ్చని మరికొన్ని సంస్థలు సూచిస్తున్నాయి. కొందరు విశ్లేషకులైతే 5,000 డాలర్ల పరిధినే మరింత వాస్తవిక లక్ష్యంగా భావిస్తున్నారు.

అందువల్ల బంగారం రూ.2 లక్షలకు చేరుతుందనే అంచనా ప్రస్తుతం ఒక అవకాశంగా మాత్రమే చూడాలి. అంతర్జాతీయ మార్కెట్ల దిశ, కేంద్ర బ్యాంకుల కొనుగోలు ధోరణి, వడ్డీ రేట్ల మార్పులు, రూపాయి-డాలర్ మారకపు విలువలు వచ్చే రెండేళ్లలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రస్తుతం మాత్రం బంగారం ధరల భవిష్యత్తుపై ఆశావహ అంచనాలు మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement