పసిడికి అమ్మకాల సెగ | Gold Price Drops Rs 1200 | Sakshi
Sakshi News home page

పసిడికి అమ్మకాల సెగ

Jun 18 2025 12:55 AM | Updated on Jun 18 2025 7:54 AM

Gold Price Drops Rs 1200

10 గ్రాములకు రూ.1,200 తగ్గుదల 

ఢిల్లీ మార్కెట్లో రూ.1,00,170

న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి పసిడి నష్టపోయింది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,200 నష్టంతో రూ.1,00,170 స్థాయికి (పన్నుతో కలిపి) దిగొచ్చింది. అంతర్జాతీయంగా ప్రతికూల ధోరణుల మధ్య జ్యుయలర్లు, స్టాకిస్టులు అమ్మకాలకు దిగడంతో బంగారం నష్టపోయినట్టు ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,100 నష్టంతో రూ.99,450 స్థాయికి పడిపోయింది. ‘‘ఇరాన్‌ దౌత్య పరిష్కారం కోసం చురుగ్గా ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన వార్తలతో, అప్పటి వరకు ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందన్న అంచనాలను ట్రేడర్లు సమీక్షించుకున్నారు.

యుద్ధ విరమణకు అవకాశం ఉన్న నేపథ్యంలో బంగారం ట్రేడర్లలో బేరిష్‌ సెంటిమెంట్‌ ఏర్పడింది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.100 పెరిగి రూ.1,07,200 స్థాయిని (పన్నుతో కలిపి) తాకింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర ఔన్స్‌కు 10 డాలర్ల నష్టంతో 3,400 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ అధిక ధరల వద్ద పసిడి పెట్టుబడుల నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించినట్టు మెహతా ఈక్విటీస్‌ కమోడిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ కళంత్రి వివరించారు. యూఎస్‌ ఫెడ్‌ పాలసీ సమావేశానికి ముందు వెండి ధరలు సైతం రోజులో గరిష్ట స్థాయిల నుంచి కిందకు దిగొచ్చినట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement