ఇంట్లోని బంగారం కొండంత అండ! | Gold Loans Boom India Outstanding Portfolio Surges to Rs 19 4 Lakh Crore | Sakshi
Sakshi News home page

ఇంట్లోని బంగారం కొండంత అండ!

Jun 24 2026 5:00 PM | Updated on Jun 24 2026 5:51 PM

Gold Loans Boom India Outstanding Portfolio Surges to Rs 19 4 Lakh Crore

భారీగా పెరుగుతున్న పసిడి రుణాలు

2025–26లో 84 శాతం వృద్ధి

రూ.19.4 లక్షల కోట్లకు చేరిన రుణాలు

కీలక అవసరాల్లో ఆర్థికంగా అండ

ఎక్స్‌పీరియన్‌ నివేదిక వెల్లడి

బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల దూకుడు

ముంబై: ఇళ్లల్లో ఉన్న బంగారం క్రమంగా బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఖజానాల్లోకి చేరుతోంది. పసిడిని నిరుపయోగంగా ఉంచకుండా, దానిపై రుణాలు తీసుకునే ధోరణి ఇటీవలి కాలంలో విస్తృతమవుతోంది. కుటుంబాల ఆర్థిక అవసరాల్లో బంగారం కొండంత అండనిస్తోంది. ఫలితంగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రత్యేక పసిడి రుణ సంస్థల మధ్య పోటీ మరింత పెరిగింది. డేటా విశ్లేషణ, క్రెడిట్‌ సమాచార సంస్థ ‘ఎక్స్‌పీరియన్‌’ విడుదల చేసిన నివేదిను పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.

  •     పసిడి రుణాలకు ఆమోదం పెరుగుతోంది. విశ్వసనీయమైన రుణ సాధనంగా వినియోగదారులు చూస్తున్నారు.  

  •     ఫలితంగా గడిచిన రెండేళ్లలో రుణాల కోసం తనఖా పెట్టిన పసిడి విలువ గణనీయంగా పెరిగింది. 2024–25లో 69 శాతం పెరిగితే, 2025–26లో 84 శాతం వృద్ధి చెందింది.  

  •     2023 మార్చి నాటికి రూ.6.3 లక్షల కోట్ల రుణాలు పసిడి తనఖాపై మంజూరు కాగా (గోల్డ్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియో), 2026 మార్చి నాటికి ఈ మొత్తం రూ.19.4 లక్షల కోట్లకు చేరింది.  

  •     ముఖ్యంగా బంగారం ధర భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీంతో తమ వద్దనున్న పసిడిపై మరింత మొత్తం రుణంగా పొందే వెసులుబాటు లభించింది. దీంతో సగటు పసిడి రుణం గత మూడేళ్లలో రూ.98వేల నుంచి రూ.1.96 లక్షలకు ఎగిసింది.  

  •     2025–26 చివరి త్రైమాసికంలో కొత్త రుణాల్లో 75 శాతం పాత రుణ గ్రహీతలు పొందినవే ఉన్నాయి.  

  •     రుణాల వృద్ధికి, అందరికీ ఆర్థిక సేవల చేరువలో పసిడి ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎక్స్‌పీరియన్‌ నివేదిక పేర్కొంది.  

  •     ఇక ఇప్పటి వరకు బంగారం రుణాల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మార్కెట్‌ విస్తృతమవుతోంది. అయితే, ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల వాటాయే అధికంగా ఉంది.  

  •     2025–26లో ఉత్తరప్రదేశ్‌లో పసిడి రుణాలు 138 శాతం పెరగ్గా, పశ్చిమ బెంగాల్లో 112 శాతం, రాజస్థాన్‌లో 105 శాతం, మహారాష్ట్రలో 102 శాతం చొప్పున పసిడి రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెందాయి.  

  •     ప్రాధాన్య రంగానికి సంబంధించి పసిడి రుణాలు (పీఎస్‌జీఎల్‌) సమ్మిళిత వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం పసిడి రుణాల్లో వీటికి సంబంధించినవే 23 శాతానికి చేరాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని వ్యాపార సంస్థలు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు, రుణ సదుపాయం అంతగా అందుబాటులో లేని వర్గాలకు పసిడి రుణాలు అండగా నిలుస్తున్నాయి. ఈ వర్గాలు ఇళ్లల్లోని బంగారంతో తమ నిధుల అవసరాలను (వ్యాపారం, కుటుంబ అవసరాలు, సాగు కోసం) తీర్చుకుంటున్నాయి.

  •     బంగారం రుణ గ్రహీతల్లో ఇతర రుణ సాధనాల వినియోగం కూడా పెరుగుతోంది. 2021 డిసెంబర్‌ నాటికి ఈ తరహా కస్టమర్లు 10 శాతంగా ఉంటే, 2025 డిసెంబర్‌ నాటికి 17 శాతానికి పెరిగారు.  

  •     పసిడి రుణాల్లో ఎగవేతలు కూడా చాలా తక్కువగా ఉంటుండడం విశేషం. 90 రోజులకు పైగా చెల్లింపుల్లేని రుణాలు 2023 మార్చి నాటికి ఉన్న 0.4 శాతం నుంచి 2026 మార్చి నాటికి 0.2 శాతానికి తగ్గాయి.  

గొప్ప ఆర్థిక సాధనం.. 
‘‘కుటుంబాల వద్ద పసిడి నిల్వలు గణనీయంగా ఉన్నాయి. దీంతో పసిడి రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో సంప్రదాయంగా నిల్వ ఉంచుకునే ఆస్తి కాస్తా రుణ సాధనంగా మారిపోయింది. ఎన్నో వ్యక్తిగత, జీవన అవసరాలను తీర్చడం ద్వారా ఆర్థిక సేవల చేరువలో పసిడి గొప్ప పాత్ర పోషిస్తోంది’’అని ఎక్స్‌పీరియన్‌ ఇండియా ఎండీ మనీష్‌జైన్‌ పేర్కొన్నారు.  

పోటాపోటీ 
పసిడి రుణాలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతుండడంతో ఈ మార్కెట్లో వాటా కోసం ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ప్రత్యేక పసిడి రుణ సంస్థలు మధ్య పోటీ తీవ్రతరమైంది. ఇంతకాలం ఈ విభాగంలో  ప్రభుత్వ బ్యాంక్‌లదే ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలు, గోల్డ్‌ ఎన్‌బీఎఫ్‌సీల నుంచి వాటికి గట్టి పోటీ ఎదురవుతోందని ఎక్స్‌పీరియన్‌ నివేదిక వెల్లడించింది. పంపిణీ విభాగం బలంగా ఉండడం, కస్టమర్లు సైతం నాన్‌ బ్యాంక్‌ గోల్డ్‌ లోన్‌ సంస్థలవైపే మొగ్గు చూపిస్తుండడం వాటికి జోష్‌నిస్తోంది.

ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 2025–26 క్యూ4లో (2026 జనవరి–మార్చి) 37 శాతానికి తగ్గింది. సరిగ్గా అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ4లో ఇది 45 శాతంగా ఉంటే, అంతక్రితం త్రైమాసికంలోనూ (2025 డిసెంబర్‌ క్వార్టర్‌) 53% ఉండడం గమనార్హం. ఇక ఇదే కాలంలో పసిడి రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 33% నుంచి 44 శాతానికి పెరిగింది. ప్రాధాన్యరంగ పసిడి రుణాల్లో మాత్రం 88% వాటా ప్రభుత్వరంగ బ్యాంకుల చేతుల్లోనే ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement