వెండి @ రూ. 2.71 లక్షలు
కేజీ ధర రూ. 6,000 అప్
పసిడి మరో రూ. 400 ప్లస్
10 గ్రాములు రూ. 1,45,000కు
వెండి, పసిడి రోజుకో రికార్డు
న్యూఢిల్లీ: రోజుకో రికార్డు నెల కొల్పుతున్న వెండి, బంగారం మరోసారి దూకుడు ప్రదర్శించాయి. కేజీ వెండి ధర రూ. 6,000 జంప్‌చేసి రూ. 2,71,000ను తాకింది. ఈ బాటలో స్థానిక(ఢిల్లీ) మార్కెట్లో బంగారం 10 గ్రాములు రూ. 400 పెరిగి రూ. 1,45,000కు చేరింది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వివరాల ప్రకారం వెండి అన్ని పన్నులు కలుపుకుని, పూర్తి స్వచ్చత కలిగిన బంగారం ధరలివి. వెరసి మరోసారి పసిడి, వెండి చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అస్థిరతలు ధరలపై ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు మరోసారి తెలియజేశాయి.
అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు తలెత్తినప్పుడు పెట్టుబడులకోసం ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలవైపు చూసే సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలతోపాటు.. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్‌లు, అసెట్ మేనేజర్స్ పసిడిలో ఇన్వెస్ట్ చేస్తుంటే.. వెండికి సోలార్, ఈవీ, ఎల్రక్టానిక్స్ తదితర ఇండ్రస్టియల్ డి మాండ్ సైతం జత కలుస్తోంది.
2 రోజుల్లో రూ. 21,000
గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్‌చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది.
అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్‌లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం!


