పీఎల్‌ఐ స్కీముపై అభిప్రాయాలు చెప్పండి - కేంద్రం

Give your opinion on PLI scheme - Sakshi

పరిశ్రమ వర్గాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని మరింత సమర్ధమంతంగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా స్కీముపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా పరిశ్రమ వర్గాలను కోరింది. స్కీము అమలు గురించి చర్చించేందుకు జూన్‌ 27న వర్క్‌షాప్‌ నిర్వహించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 

పీఎల్‌ఐ అమలు ప్రక్రియలో లబ్ధిదారులకు ఏవైనా సవాళ్లు, సమస్యలు ఉంటే వాటిని అమలు చేస్తున్న శాఖలు లేదా విభాగాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. తద్వారా సానుకూలమైన సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు, స్కీమును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని పేర్కొంది. రూ. 3,400 కోట్లకు క్లెయిమ్స్‌ వచ్చినప్పటికీ 2023 మార్చి ఆఖరు నాటికి స్కీము కింద ప్రభుత్వం రూ. 2,900 కోట్లు మాత్రమే విడుదల చేసిన నేపథ్యంలో వర్క్‌షాప్‌ నిర్వహణ ప్రాధాన్యం సంతరించుకుంది.

 

పీఎల్‌ఐ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి వారితో తరచుగా సంప్రదింపులు జరపాలని వివిధ విభాగాలకు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ సూచించారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో 2021లో టెలికం, ఫార్మా తదితర 14 రంగాలకు రూ. 1.97 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం పీఎల్‌ఐ స్కీమును ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top