న్యూఢిల్లీ: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలోనూ (జూలై–సెప్టెంబర్) బలమైన పనితీరు చూపిస్తుందని, 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం కీలక చోదకంగా నిలుస్తుందని తెలిపింది.
క్రితం ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. క్యూ2 జీడీపీ గణాంకాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి. ‘‘ఉన్నత, మధ్యాదాయ వర్గాల వారికి ఆదాయం స్థిరంగా పెరుగుతుండడం ప్రైవేటు వినియోగానికి కీలక చోదకంగా నిలుస్తుంది. సేవల రంగం బలమైన పనితీరు, వస్తు ఎగుమతుల పెరుగుదల జీడీపీ వృద్ధిని మరింత పైకి తీసుకెళుతుంది’’అని ఇండ్–రా ఆర్థికవేత్త పరాస్ జస్రాయ్ పేర్కొన్నారు.
దేశీ డిమాండ్ బలంగా ఉండడం, ఆర్‌బీఐ అంచనాలకంటే వేగంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వేతన వృద్ధికి, వినియోగానికి మద్దతుగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రైవేటు వినియోగం క్యూ2లో 8 శాతం వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2లో 6.4 శాతం వృద్ధి నమోదు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది 7 శాతం పెరిగినట్టు తెలిపింది. ఆదాయపన్ను తగ్గింపులు సైతం వినియోగానికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది.


