జీడీపీ గణాంకాలపై ఫోకస్‌  | GDP figures, monsoon progress, and developments in US bond markets | Sakshi
Sakshi News home page

జీడీపీ గణాంకాలపై ఫోకస్‌ 

May 26 2025 5:20 AM | Updated on May 26 2025 5:20 AM

GDP figures, monsoon progress, and developments in US bond markets

ప్రపంచ మార్కెట్లలో ట్రెండ్‌కు ప్రాధాన్యం 

విదేశీ పెట్టుబడులు, రుతుపవనాలు కీలకం 

ప్రైమరీ మార్కెట్‌వైపు ఇన్వెస్టర్ల చూపు 

దేశీ స్టాక్‌ మార్కెట్‌పై నిపుణుల అంచనాలు

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా యూఎస్, భారత్‌ జీడీపీ గణాంకాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ  వివరాలు, రుతుపవనాల తీరు తదితర పలు  అంశాలు సైతం ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు  తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 

న్యూఢిల్లీ: ఇటు దేశీ, అటు విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. ప్రధానంగా పలు ఆర్థిక గణాంకాలు ఈ వారం వెలువడనున్నాయి. దేశీయంగా చూస్తే ఏప్రిల్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), త యారీ రంగ గణాంకాలను ప్రభుత్వం బుధవారం(28న) ప్రకటించనుంది. 2025 మార్చిలో ఐఐపీ, తయారీ రంగాలు 3% చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో జనవరి –మార్చి2025 కాలానికి దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పురోగతి గణాంకాలు శుక్రవారం(30న) వెల్లడికానున్నాయి.  2024 అక్టోబర్‌–డిసెంబర్‌లో దేశ జీడీపీ 6.2 శాతం ఎగసింది. వీటిపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు.  

విదేశీ అంశాలు 
ఏప్రిల్‌ నెలకు యూఎస్‌ మన్నికైన వస్తు ఆర్డర్లు 27న, కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌(ఎఫ్‌వోఎంసీ) గత పాలసీ సమీక్ష వివరాలు(మినిట్స్‌) 28న విడుదలకానున్నాయి. 29న క్యూ1 జీడీపీ రెండో అంచనాలు వెలువడనున్నాయి. ఇదే రోజు మే నెలకు జపాన్‌ కన్జూమర్‌ కాని్ఫడెన్స్‌ ఇండెక్స్‌ వెల్లడికానుంది. 30న యూఎస్‌ ఏప్రిల్‌ పీసీఈ ధరల ఇండెక్స్‌ విడుదలకానుంది. కాగా.. చైనాసహా ఇతర దేశాలతో యూఎస్‌ వాణిజ్య చర్చలకు ప్రాధాన్యమున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ తెలియజేశారు. కొద్ది రోజులుగా మళ్లీ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నప్పటికీ కొన్ని సెషన్లలో అమ్మకాలకూ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్ల తీరు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలదని నిపుణులు పేర్కొన్నారు.    

క్యూ4 ఫలితాలు 
ఇప్పటికే క్యూ4(జనవరి–మార్చి2025) ఫలితాల సీజన్‌ ముగింపునకురాగా.. ఈ వారం మరికొన్ని దిగ్గజాల పనితీరు వెల్లడికానుంది. జాబితాలో బజాజ్‌ ఆటో, ఐఆర్‌సీటీసీ, అరబిందో ఫార్మా తదితరాలున్నాయి. ఈ ఏడాది అంచనాలకంటే ముందుగానే రుతుపవనాలు కేరళను తాకడం, కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ అత్యధిక డివిడెండ్‌ చెల్లింపు సానుకూల అంశాలుకాగా.. యూఎస్‌ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌తోపాటు, ప్రభుత్వ రుణ భారం అధికమవుతుండటం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచవచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. గత వారాంతాన ఆర్‌బీఐ ప్రభుత్వానికి రూ. 2.69 లక్షల రికార్డ్‌ డివిడెండ్‌ చెల్లించిన సంగతి తెలిసిందే.  
సాంకేతికంగా 
గత వారం మార్కెట్లు స్వల్పంగా డీలా పడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నికరంగా 610 పాయింట్లు(0.75 శాతం) క్షీణించి 81,721 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 167 పాయింట్లు(0.7 శాతం) నష్టంతో 24,853 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.3 శాతం నీరసించగా.. స్మాల్‌ క్యాప్‌ మాత్రం 0.95 శాతం ఎగసింది. సాంకేతికంగా ఈ వారం నిఫ్టీకి 24,950–25,000 పాయింట్ల వద్ద అవరోధాలు(రెసిస్టెన్స్‌) ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ బాటలో సెన్సెక్స్‌కు 82,500–83,000 పాయింట్లవద్ద రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని అంచనా వేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement