న్యూఢిల్లీ: దేశీయంగా వినియోగానికి డిమాండ్ పటిష్టంగా ఉండటం, ప్రభుత్వం కూడా గణనీయంగా వ్యయాలు చేయడంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలకు మించి వృద్ధి చెందింది. 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది 7 శాతంగాను, తాజా క్యూ3లో 8 శాతంగాను నమోదైంది. ఇక వినియోగం, పెట్టుబడులు మెరుగ్గా ఉండటంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ 7.7 శాతం మేర వృద్ధి చెందింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 7.1 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడితే 2028 ఆర్థిక సంవత్సరంలో భారత్ మళ్లీ 7 శాతానికి పైగా వృద్ధి సాధించవచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఆర్‌బీఐ అంచనా వేస్తున్నట్లుగా 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7 శాతం లోపునకు నెమ్మదించినా, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ప్రభుత్వం తీసుకునే పాలసీపరమైన చర్యలనేవి ఎకానమీ మళ్లీ 7 శాతం పైగా వృద్ధి రేటువైపు మళ్లేందుకు దోహదపడగలవని పేర్కొన్నారు. స్థిర ధరల ప్రాతిపదికన వాస్తవ జీడీపీ 2025–26లో రూ. 323.12 లక్షల కోట్ల స్థాయిలో ఉంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) పేర్కొంది. ప్రస్తుత ధరల్లో నామినల్ జీడీపీ రూ. 346.36 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని వివరించింది. 2025–26లో నిర్మాణం, తయారీ, ట్రేడ్, హోటల్స్, రియల్ ఎస్టేట్, ఐటీ తదితర సెకండరీ, టర్షరీ రంగాలు వరుసగా 8.8 శాతం, 9.3 శాతం వృద్ధి చెందాయి. వ్యవసాయం, ఫిషరీ రంగాల దన్నుతో ప్రైమరీ సెక్టార్ 3.6 శాతం వృద్ధి చెందింది.
పశ్చిమాసియా ప్రభావం క్యూ1లో ..
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం జనవరి–మార్చి త్రైమాసికంలో ఒక నెలలోనే కనిపించింది. కీలకమైన ముడి చమురు, నేచురల్ గ్యాస్, ఎల్‌పీజీపరంగా సంక్షోభ పూర్తి ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) కనిపించనుంది. ఇంధనాలు, కమోడిటీల ధరలు భారీ స్థాయిలో తిరుగాడుతుండటం, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తదితర సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను రిజర్వ్ బ్యాంక్ 6.9% నుంచి 6.6 శాతానికి తగ్గించింది.
సంస్కరణల ఎక్స్‌ప్రెస్ దూకుడు..
గ్లోబల్ సవాళ్ల నడుమ ఆర్థిక ప్రగతి సాధించే దిశగా పాలసీలపరంగా నిర్ణయాత్మక చర్యలతో సంస్కరణల ఎక్స్‌ప్రెస్ దూకుడుని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్స్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేశారు.


