ఎరువుల కొరతతో ఆహారోత్పత్తిపై ప్రభావం
వ్యూహాత్మక నిల్వలు సమకూర్చుకోవాలి
వికసిత్ భారత్ సాధనకు సంస్కరణలు అవసరం
ఎస్‌అండ్‌పీ గ్లోబల్, క్రిసిల్ సంయుక్త నివేదిక
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ తెలిపింది. గతంలో 7.1 శాతం వృద్ధి అంచనాను ప్రకటించడం గమనార్హం. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంధన, ఆహార భద్రత రంగాల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌అండ్‌పీ గ్లోబల్, క్రిసిల్ సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేశాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం వంటి సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని తెలిపింది. వీటిని అధిగమించేందుకు భారత్ తగినన్ని ఇంధన నిల్వలు సమకూర్చుకోవాలంటూ.. ఇందుకు వీలుగా ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించుకోవాలని సూచించింది. చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం ఆర్థిక వృద్ధిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి పేర్కొన్నారు.
ఆహార భద్రతకు రిస్క్
పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా శీతాకాలం పంటలకు ఎరువుల కొరత ఏర్పడొచ్చని జోషి అంచనా వేశారు. భారత్ ఇంధన, ఆహార భద్రత, ఎరువుల రంగంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. భారత్ వివిధ దేశాలతో ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ద్వారా తగిన ప్రయోజనాలను అందుకోవాలంటే.. అంతర్జాతీయ స్థాయిలో మరింత పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని.. ఎఫ్‌టీఏలతో మరిన్ని మార్కెట్ అవకాశాలు లభించినప్పటికీ, వివిధ రంగాల్లో సంస్కరణలు చేపట్టినప్పుడే పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని నివేదిక తెలిపింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ఒక దశలో 126 డాలర్ల వరకు వెళ్లగా, ప్రస్తుతం 100 డాలర్ల స్థాయిలో ఉండడం గమనార్హం. యుద్ధానికి ముందు 60–70 డాలర్ల మధ్యే ఉంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూస్తోంది. ఎక్సైజ్ ట్యాక్స్ వరకు తగ్గించడం తెలిసిందే. టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ), రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ)పై అధిక చమురు ధరల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్నకు జోషి స్పందిస్తూ.. అంతర్జాతీయంగా అధిక ధరలు ఉన్నప్పటికీ భారత్‌లో వినియోగదారులకు దాన్ని బదిలీ చేయనట్టు చెప్పారు. దీని కారణంగా టోకు ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది గరిష్ట స్థాయి అయిన 3.4 శాతానికి పెరగ్గా.. టోకు ద్రవ్యోల్బణం 38 నెలల గరిష్ట స్థాయి 3.88 శాతానికి చేరడం తెలిసిందే.


