
ఐఫోన్ 17 ఉత్పత్తితో ఆరంభం
రూ.25,000 కోట్లతో ఏర్పాటైన యూనిట్
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ బెంగళూరులోని తన యూనిట్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. స్వల్ప స్థాయిలో ఐఫోన్ 17 ఉత్పత్తిని ఆరంభించింది. చైనా తర్వాత రెండో అతిపెద్ద తయారీ కేంద్రాన్ని బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి వద్ద 2.8 బిలియన్ డాలర్లతో (రూ.25,000 కోట్లు) ఫాక్స్‌కాన్ ఏర్పాటు చేయడం గమనార్హం.
ఐఫోన్ తయారీలో ఫాక్స్‌కాన్ అతిపెద్ద సంస్థగా ఉంది. బెంగళూరులోని యూనిట్లో ఐఫోన్ 17 ఉత్పత్తితో కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు.. చెన్నై యూనిట్‌లోనూ ఐఫోన్ 17 తయారీ చేస్తున్నట్టు ఈ వ్యహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఫాక్స్‌కాన్ బెంగళూరు యూనిట్ నుంచి వందలాది చైనా ఇంజనీర్లు, నిపుణులు అర్ధంతరంగా వెనక్కి వెళ్లిపోవడం తెలిసిందే. అవసరం అయితే తైవాన్ నుంచి అయినా నిపుణులను తెచ్చుకోగల సామర్థ్యం ఫాక్స్‌కాన్‌కు ఉండడంతో దీని ప్రభావం పెద్దగా పడలేదు.
60 మిలియన్ ఐఫోన్లు
ఐఫోన్ తయారీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 మిలియన్ యూనిట్లకు పెంచే ప్రణాళికతో ఫాక్స్‌కాన్ ఉంది. 2024–25లో 35–40 యూనిట్లను తయారు చేసింది. 2025 జూన్‌లో అమెరికాలో విక్రయించిన మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవేనని యాపిల్ సీఈవో టిక్‌కుక్ జూలై 31న ప్రకటించడం గమనార్హం. అంతేకాదు, జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించిన ఐఫోన్లు సైతం భారత్ నుంచి రవాణా చేసినవిగా ఫలితాల అనంతరం సమావేశంలో ప్రకటించారు. భారత్‌లోని యాపిల్ సరఫరాదార్లు 2025 మొదటి ఆరు నెల్లో 5.9 మిలియన్ యూనిట్లన సరఫరా చేశారు. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 21.5 శాతం అధికం. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ అంచనా ప్రకారం 2024లో అమెరికాలో ఐఫోన్ల అమ్మకాలు 75.9 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి.