జనవరి–సెప్టెంబర్ మధ్య 14% అప్
2.2 బిలియన్ డాలర్లుగా నమోదు
ట్రాక్షన్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీ ఫిన్‌టెక్ కంపెనీలు జోరుగా నిధులను సమీకరిస్తున్నాయి. 2026 జనవరి–సెప్టెంబర్ మధ్యకాలంలో 2.2 బిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 14 శాతం అధికం. అదే సమయంలో డీల్స్ సంఖ్య 41 శాతం తగ్గి 260 నుంచి 153కి పడిపోయింది. గతంలో 2021 తొలి 9 నెలల్లో రికార్డు స్థాయిలో 5.5 బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి. మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం ట్రాక్షన్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
తాజాగా మొత్తం నిధుల సమీకరణలో 100 మిలియన్ డాలర్లు లేదా అంతకు మించిన ఐదు డీల్స్ వాటా దాదాపు సగానికి పైగా ఉండటం గమనార్హం. వీటితో 1.1 బిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చింది. జూన్‌లో మెటా నుంచి క్రెడ్ సమీకరించిన 540 మిలియన్ డాలర్లు.. మొత్తం ఫండింగ్‌లో పావు వంతు వాటాను ఆక్రమించింది. ఇక లిస్టులో తర్వాత స్థానాల్లో క్రెడిట్‌బీ (ఏప్రిల్‌లో 220 మిలియన్ డాలర్లు), వీవర్ (మార్చిలో 103 మిలియన్ డాలర్లు), స్లైస్ (సెప్టెంబర్‌లో 100 మిలియన్ డాలర్లు), నవీ (ఆగస్టులో 100 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.
రిపోర్టులో మరిన్ని విశేషాలు..
» సిరీస్ సీ, ఆ తర్వాత విడతలు, ప్రైవేట్ ఈక్విటీ, ప్రీ–ఐపీవో పెట్టుబడులకు సంబంధించి లేట్ స్టేజ్ ఫండింగ్ డీల్స్ సంఖ్య 30 నుంచి 25కి తగ్గినప్పటికీ నిధుల సమీకరణ 751 మిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్లకు రెట్టింపయ్యింది. సమీకరించిన మొత్తం పెట్టుబడుల్లో ఈ విభాగం వాటా 67 శాతంగా నమోదైంది.
» ఎర్లీ స్టేజ్ ఫండింగ్ (సిరీస్ ఏ, బీ) 52 డీల్స్‌వ్యాప్తంగా 33 శాతం తగ్గి 668 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో 82 ఒప్పందాలవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్ల సమీకరణ నమోదైంది. సీడ్ ఫండింగ్ 76 రౌండ్లవ్యాప్తంగా 57 శాతం క్షీణించి 73.8 మిలియన్ డాలర్లకు నెమ్మదించింది. గతేడాది 148 రౌండ్లలో 173 మిలియన్ డాలర్లు వచ్చాయి.
» తొలిసారిగా నిధులు సమీకరించిన సంస్థల సంఖ్య 59 నుంచి 30కి పడిపోయింది. పరిశ్రమలో ప్రస్తుత ఇన్వెస్టర్ల సంఖ్య 192 నుంచి 125కి, ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్ల సంఖ్య 48 నుంచి 33కి తగ్గింది.
» సెగ్మెంట్లవారీగా చూస్తే డిజిటల్ రుణాల్లోకి అత్యధికంగా 809 మిలియన్ డాలర్లు రాగా, పేమెంట్స్‌లోకి 776 మిలియన్ డాలర్లు, ఇన్వెస్ట్‌మెంట్ టెక్‌లోకి 450 మిలియన్ డాలర్లు వచ్చాయి.
» ఫిన్‌టెక్ ఫండింగ్‌లో బెంగళూరు వాటా 52 శాతం నుంచి అత్యధికంగా 62 శాతానికి (1.4 బిలియన్ డాలర్లు) పెరిగింది. తర్వాత స్థానాల్లో ముంబై (24 శాతం), గురుగ్రామ్ (7 శాతం) ఉన్నాయి.
» ఫిన్‌టెక్ విభాగంలో కొత్తగా మూడు సంస్థలు యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) హోదాను దక్కించుకున్నాయి. స్క్వేర్ యార్డ్స్, క్రెడిట్‌బీ, నియో గ్రూప్ వీటిలో ఉన్నాయి. గతేడాది రెండే కంపెనీలకు ఈ హోదా దక్కింది.
» ఇక ఐపీవోలు రెండు నుంచి మూడుకు పెరిగాయి. ఆగ్మంట్, టర్టిల్‌మింట్, కిష్త్ వీటిలో ఉన్నాయి.
» ఇతర కంపెనీల కొనుగోలు డీల్స్ సంఖ్య 20 నుంచి 45 శాతం క్షీణించి 11కి పడిపోయింది. ఫిన్‌టెక్ క్లౌడ్‌ను ఇండియాబుల్స్ గ్రూప్ అత్యధికంగా 110 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. గోల్డెన్‌పై ని ఆక్సిజో దక్కించుకోవడం (4.4 మిలియన్ డాలర్లు), ఫిన్‌టూ ని చాయిస్ సంస్థ 1.1 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ఇతర పెద్ద డీల్స్‌లో ఉన్నాయి.


