స్వదేశీ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తన ఫ్లీట్‌లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్యను 20,000 పెంచింది. 2030 నాటికి తన మొత్తం డెలివరీ ఫ్లీట్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే లక్ష్యం దిశగా కంపెనీ అడుగులు వేస్తూ.. ఎప్పటికప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్యను పెంచుకుంటూ పోతోంది.
ఫ్లిప్‌కార్ట్ లాంగ్ హాల్ EV ట్రక్ పైలట్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరాల మధ్య పెద్ద దూరాల రవాణా కోసం కూడా ఎలక్ట్రిక్ ట్రక్కులను పరీక్షిస్తోంది. కాగా ఇప్పుడు కొత్తగా చేర్చిన ఎలక్ట్రిక్ వాహనాలను ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లక్నోతో సహా కీలకమైన మెట్రో, టైర్-2+ నగరాల్లో తన కార్యకలాపాల నిర్వహణ కోసం ఉపయోగించనుంది.
ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో 70% కంటే ఎక్కువ కిరాణా డెలివరీల కోసం ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగిస్తోంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో తన వంతు పాత్రగా కంపెనీ అడుగులు వేస్తోంది. ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం ఛార్జింగ్ సదుపాయాల విస్తరణ, వాహన తయారీదారులతో భాగస్వామ్యాలు, బ్యాటరీ నిర్వహణ పరిష్కారాలు వంటి పలు కార్యక్రమాలను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది.


