మళ్లీ ఫోకస్‌లోకి ఈక్విటీ ఫండ్స్‌ | Equity Mutual Funds Shine in February | Sakshi
Sakshi News home page

మళ్లీ ఫోకస్‌లోకి ఈక్విటీ ఫండ్స్‌

Mar 12 2026 8:47 AM | Updated on Mar 12 2026 8:47 AM

Equity Mutual Funds Shine in February

ఫిబ్రవరిలో రూ.25,978 కోట్ల పెట్టుబడులు

నెలవారీగా చూస్తే 8 శాతం అధికం

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌కు ఆదరణ

స్థిరంగానే సిప్‌ పెట్టుబడులు

కళ తప్పిన గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లు

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫిబ్రవరిలో మెరిశాయి. అంతకుముందు రెండు నెలల్లో వరుస క్షీణత తర్వాత మెరుగైన పెట్టుబడులు నమోదయ్యాయి. రూ.25,978 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జనవరిలో వచ్చిన రూ.24,028 కోట్ల కంటే 8 శాతం అధికం. 2025 డిసెంబర్‌లో రూ.28,054 కోట్లు, నవంబర్‌లో రూ.29,911 కోట్ల చొప్పున పెట్టుబడులు రావడం గమనార్హం. 

ఫిబ్రవరి చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ రూ.82.3 లక్షల కోట్లకు చేరుకుంది. జనవరి చివరికి ఈ మొత్తం రూ.81 లక్షల కోట్లుగానే ఉంది. ఈ వివరాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసింది. అంతర్జాతీయ పరిణామాల మధ్య దేశీ ఈక్విటీలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న తరుణంలోనూ ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన పెట్టుబడుల రాక వారిలోని విశ్వాసానికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు.  

విభాగాల వారీ..

  • ఫిబ్రవరిలో ఫండ్స్‌ పరిశ్రమలో 42.58 లక్షల కొత్త ఫోలియోలు నికరంగా పెరిగాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు సంఖ్యను ఫోలియోగా చెబుతారు.  

  • అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ రూ.6,295 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వరుసగా ఏడో నెలలోనూ ఈ పథకాలు మెరుగైన పెట్టుబడులను రాబట్టాయి.

  • మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.4,003 కోట్లు, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ సైతం రూ.3,881 కోట్లు ఆకర్షించి మెరిశాయి.

  • సెక్టోరల్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌లోకి రూ.2,987 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  

  • ఫిబ్రవరిలో కొత్త ఫండ్‌ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌వో) ఇన్వెస్టర్ల నుంచి రూ.3,995 కోట్లను సమీకరించాయి. ముఖ్యంగా సెక్టోరల్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌ విభాగంలో ఆరు ఎన్‌ఎఫ్‌వోలు కలిపి రూ.3,560 కోట్లను ఆకర్షించడం గమనార్హం. ఒక లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌వో రూ.324 కోట్లు, మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌వో రూ.71 కోట్ల చొప్పున సమీకరించాయి.

కళ తప్పిన వెండి ఈటీఎఫ్‌లు  

  • వెండి ఈటీఎఫ్‌లు జవనరిలో రూ.9,463 కోట్లను ఆకర్షించి రికార్డు సృష్టించగా.. ఫిబ్రవరిలో పరిస్థితి తలకిందులైంది.  ఇన్వెస్టర్లు నికరంగా రూ.826 కోట్లను వెండి ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కి తీసుకున్నారు. 2023 నవంబర్‌ తర్వాత వెండి ఈటీఎఫ్‌ల నుంచి పెబ్టుబడులు బయటకు వెళ్లిపోవడం ఇదే మొదటిసారి.

  • బంగారం ఈటీఎఫ్‌ల్లోకి రూ.5,255 కోట్లు వచ్చాయి. జనవరిలో వచ్చిన రూ.24,039 కోట్లు, 2025 డిసెంబర్‌లో వచ్చిన రూ.11,647 కోట్లతో పోలి్చతే గణనీయంగా తగ్గాయి. వెండి, బంగారం ధరలు ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి కొంత దిద్దుబాటుకు గురైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణికి గురైనట్టు తెలుస్తోంది.  

  • ఇండెక్స్‌ ఫండ్స్‌లోకి రూ.3,233 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  

  • డెట్‌ ఫండ్స్‌ రూ.42,106 కోట్లను ఆకర్షించాయి. జనవరిలో వచి్చన రూ.74,827 కోట్లతో పోలిస్తే తగ్గాయి.

పటిష్టంగానే సిప్‌ పెట్టుబడులు

ఫిబ్రవరిలో సిప్‌ పెట్టుబడులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. బలంగానే నమోదయ్యాయి. రూ.29,845 కోట్లను సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో పెట్టుబడి పెట్టారు. జనవరిలో ఇవి రూ.31,002 కోట్లుగా ఉన్నాయి. అయినప్పటికీ ఫండ్స్‌ నిర్వహణలోని సిప్‌ ఆస్తుల విలువ నెలవారీగా 1.7 శాతం పెరిగి రూ.16.64 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తుల్లో 20.3 శాతం సిప్‌ రూపంలోనే వచి్చనవే కావడం గమనార్హం. సిప్‌ల నిలిపివేత 76 శాతంగా ఉంది. జనవరిలో నిలిపివేత 74 శాతం కంటే స్వల్పంగా పెరిగింది. ఫిబ్రవరిలో 28 రోజులే ఉండడం సిప్‌ పెట్టుబడులు తగ్గడానికి కారణమని యాంఫి సీఈవో వెంకట్‌ ఎన్‌ చలసాని తెలిపారు. 29, 30, 31వ తేదీల్లోని సిప్‌ వాయిదాలు మార్చి నెలలో ప్రాసెస్‌ అవుతుంటాయని చెప్పారు.

సిఫ్‌కు భలే ఆదరణ

సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గంలోనే అధిక రాబడి కోరుకునే వారి కోసం తీసుకొచ్చిన స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌) నిర్వహణ ఆస్తులు ఫిబ్రవరిలో రూ.9,711 కోట్లకు పెరిగాయి. జనవరితో పోల్చితే 47.9 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఫండ్స్‌లో కనీసం రూ.10 లక్షల ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో ఈ విభాగంలోకి నికరంగా రూ.3,127 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మూడు కొత్త సిఫ్‌లు ప్రారంభమయ్యాయి. రెండు ఈక్విటీ స్ట్రాటజీ సిఫ్‌లు రూ.916 కోట్లు, ఒక హైబ్రిడ్‌ స్ట్రాటజీ సిఫ్‌ రూ.436 కోట్లను సమీకరించాయి.

ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌.. తర్వాత దీని వంతే!

Advertisement
 
Advertisement
Advertisement