
ఐదు నెలల తగ్గుదల ట్రెండ్‌కు బ్రేక్...
జూన్‌లో రూ.23,587 కోట్ల పెట్టుబడులు
మే నెలలో పోలిస్తే 24 శాతం జంప్...
పటిష్టమైన స్టాక్ మార్కెట్ల దన్ను...
సిప్ పెట్టుబడులూ రయ్ రయ్...
న్యూఢిల్లీ: గత ఐదు నెలలుగా దిగజారుతూ వస్తున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడుల ప్రతికూల ట్రెండ్‌కు ఎట్టకేలకు బ్రేక్ పడింది. జూన్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా రూ.23,587 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. మే నెలలో వచ్చిన రూ.19,013 కోట్లతో పోలిస్తే 24 శాతం జంప్ చేశాయి. స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకోవడంతో అన్ని ఫండ్ విభాగాలకూ దన్నుగా నిలుస్తోంది.
కాగా, ఈక్విటీ ఫండ్స్ విభాగంలోకి వరుసగా 52వ నెలలోనూ నికర పెట్టుబడులు నమోదయ్యాయి. మరోపక్క, ఇన్వెస్టర్ల సానుకూల ధోరణితో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు కూడా జోరుందుకున్నాయి. జూన్‌లో వివిధ పథకాల్లోకి రూ. 27,269 కోట్లు సిప్ రూపంలో వచ్చి చేరాయి. మే నెలలో ఈ మొత్తం రూ.26,688 కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఇతర ముఖ్యాంశాలివీ...
→ గతేడాది నవంబర్‌లో రూ.35,943 కోట్ల నుంచి డిసెంబర్‌లో రూ.41,156 కోట్లకు ఎగబాకిన ఈక్విటీ ఎంఎఫ్ పెట్టుబడులు... ఆ తర్వాత నెల నుంచి అంతకంతకూ పడిపోతూనే వచ్చాయి. మే నెలలో ఏకంగా రూ.20,000 కోట్ల దిగువకు చేరాయి. జూన్‌లో దీనికి అడ్డుకట్టపడటం మార్కెట్లో సానుకూల ధోరణికి నిదర్శనం.
→ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లోకి జూన్‌లో రికార్డు స్థాయిలో రూ.5,733 కోట్లు వచ్చి పడ్డాయి, తర్వాత స్థానాల్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ (రూ.4,024 కోట్లు), మిడ్ క్యాప్ ఫండ్స్ (రూ.3,754 కోట్లు), లార్జ్ క్యాప్ ఫండ్స్ (రూ.1,694 కోట్లు) నిలిచాయి.
→ ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్)లోకి జూన్‌లో రూ.566 కోట్ల నిధులు వచ్చాయి.
→ ఈక్విటీల మాదిరిగానే హైబ్రిడ్ ఫండ్స్‌లోకి కూడా దండిగానే పెట్టుబడులు ప్రవహించాయి. రూ.23,223 కోట్లు లభించాయి. మే నెలలో ఇది రూ.20,765 కోట్లుగా నమోదైంది.
→ మొత్తంమీద మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు జూన్‌లో రూ.49,000 కోట్ల నిధులు లభించాయి. మే నెలలో ఈ మొత్తం రూ.29,000 కోట్లుగా ఉంది.
→ బంగారం ధరల పటిష్ట ధోరణికి అద్దం పడుతూ గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదారణ భారీగా పెరిగింది. మే నెలలో కేవలం రూ.292 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రాగా... జూన్‌లో ఏకంగా రూ. 2,081 కోట్ల నికర పెట్టుబడులు వచ్చిపడ్డాయి. జనవరి తర్వాత మళ్లీ ఈ స్థాయిలో నిధులు వెల్లువెత్తడం ఇదే తొలిసారి.
→ మరోపక్క, డెట్ ఫండ్స్ నుంచి నిధుల ఉపసంహరణ వేగం కూడా తగ్గింది. జూన్‌లో రూ.1,711 కోట్లు బయటికెళ్లాయి. మే నెలలో ఈ మొత్తం రూ.15,908 కోట్లుగా ఉంది. దీనికి ముందు ఏప్రిల్‌లో డెట్ ఫండ్స్ ఏకంగా రూ.2.2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం.
→ తాజా నిధుల జోరుతో జూన్ చివరి నాటికి ఎంఫ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ రూ. 74.4 లక్షల కోట్లకు ఎగబాకింది. మే చివరికి ఏయూఎం రూ.72.2 లక్షల కోట్లుగా నమోదైంది.
సిప్ దన్ను...
ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) వృద్ధి పథంలో పయనించడానికి రిటైల్ ఇన్వెస్టర్ల బలమైన భాగస్వామ్యమే కారణం. సిప్ పెట్టుబడులు స్థిరంగా నమోదవుతుండటం ఫండ్ పథకాలకు దన్నుగా నిలుస్తోంది.
– వెంకట్ చలసాని, యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
పరిశ్రమకు సానుకూలం...
ఈక్విటీ ఫండ్స్‌లోకి నిధుల ప్రవాహం క్రమంగా పుంజుకోవడం... ఇన్వెస్టర్లలో మళ్లీ విశ్వాసం నెలకొందనడానికి నిదర్శనం. ఎంఎఫ్ పరిశ్రమకు, దేశీ స్టాక్ మార్కెట్లకు ఇది అత్యంత సానుకూలాంశం.
– అఖిల్ చతుర్వేది, మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ ఈడీ, సీబీఓ
స్టాక్ మార్కెట్ జోరుతో
దేశీయంగా స్టాక్ మార్కెట్లు మళ్లీ పరుగులు పెడుతుండటంతో అన్ని విభాగాలూ కళకళలాడుతున్నాయి. నిఫ్టీ50తో పాటు మిడ్, స్మాల్ క్యాప్ సూచీలూ పటిష్టమైన ర్యాలీ చేశాయి. ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మళ్లీ ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.
– హిమాన్షు శ్రీవాస్తవ, మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్