
జూన్‌లో ఐఐపీ 4.9 శాతంగా నమోదు
1.5 శాతం వృద్ధికి పరిమితం
పది నెలల కనిష్టానికి చేరిక
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగం వృద్ధి జూన్‌లోనూ నిదానించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.9 శాతంగా నమోదైంది. వృద్ధి 1.5 శాతానికి పరిమితమైంది. ఇది పది నెలల (2024 ఆగస్ట్ తర్వాత) కనిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్ రంగాల్లో పనితీరు ఢీలాపడింది. జూన్ చివర్లో వర్షాలు ఈ రంగాల పనితీరును ప్రభావితం చేశాయి. ఈ మేరకు జూన్ నెలకు సంబంధించి ఐఐపీ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసింది. మే నెలకు సంబంధించిన ఐఐపీ రేటును 1.2 శాతం నుంచి 1.9 శాతానికి సవరించినట్టు ఎన్‌ఎస్‌వో ప్రకటించింది.
→ తయారీ రంగంలో ఉత్పత్తి జూన్‌లో 3.9 శాతం పెరిగింది. 2024 జూన్‌లో ఈ రంగంలో ఉత్పత్తి 3.5 శాతం వృద్ధి చెందడం గమనార్హం.
→ మైనింగ్‌లో ఉత్పత్తి మైనస్ 8.7 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే నెలలో 10.3 శాతం వృద్ధి నమోదైంది.
→ విద్యుదుత్పత్తి సైతం మైనస్ 2.6 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో 8.6 శాతం వృద్ధి నమోదైంది.
→ క్యాపిటల్ గూడ్స్ విభాగంలోనూ వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది.
→ కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి 2.9 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 8.8 శాతంగా ఉంది.
→ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మైనస్ 0.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది జూన్‌లోనూ మైనస్ ఒక శాతంగా ఉండడం గమనార్హం.
→ ఇన్‌ఫ్రా/నిర్మాణ రంగంలో 7.2 శాతం వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇది 8.2 శాతం వృద్ధిని చూసింది.
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్)నూ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4 శాతంగా ఉంది.
వర్షాల ప్రభావం..
జూన్ రెండో భాగంలో అధిక వర్షాలు మైనింగ్ ఉత్పత్తి, విద్యుత్ రంగాలపై ప్రభావం చూపించినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. త్రైమాసికం వారీగా చూస్తే వృద్ధి 11 నెలల కనిష్ట స్థాయికి చేరినట్టు పేర్కొన్నారు.