
మీకు ఉద్యోగం లేదా.. రాజీనామా చేసి చాలాకాలమైందా? మూడేళ్లు కూడా దాటిపోయిందా.. అయితే ఇక మీరు మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం డ్రా చేసేసుకోవచ్చు. ఉద్యోగం లేకుండా ఉంటే రెండు నెలలు దాటగానే పీఎఫ్ అకౌంట్‌ను ఖాళీ చేసేందుకు ఇప్పటివరకూ అవకాశం ఉండగా... ఈపీఎఫ్‌ఓ బోర్డు తాజా నిర్ణయంతో అది మూడేళ్లకు పెరిగింది.
కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మార్పును ఆమోదించింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) దీర్ఘకాలం పాటు ఉపాధి లేకుండా కొనసాగిన సందర్భాల్లోనే సభ్యులు తుది పరిష్కారాన్ని ఎంపిక చేసుకునేందుకు, భవిష్యనిధి ఖాతాలోని మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. 12 నెలలుగా ఉద్యోగం లేని వారు (పదవీ విరమణ కాలం తీరకముందే ) ఈపీఎఫ్ తుది పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
36 నెలల పాటు ఉద్యోగం లేకుండా కొనసాగితే అప్పుడు భవిష్యనిధితోపాటు పెన్షన్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని (EPF withdrawal) ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ప్రస్తుతం రెండు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న వారు నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. దీంతో చాలా మంది 2 నెలల తర్వాత ఖాతాను ఖాళీ చేస్తున్న నేపథ్యంలో.. వారి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది.
ఈపీఎఫ్ ఉపసంహరణలో కీలక మార్పులు
ఇక మూడు రకాల ఉపసంహరణలే..
ఇంతకుముందు, ఈపీఎఫ్ నుండి పాక్షిక ఉపసంహరణకు అనుమతించే 13 నిబంధనలు ఉండేవి. వీటన్నింటినీ విలీనం చేస్తూ కేవలం మూడు నిబంధనలను ఉంచాలని సీబీటీ నిర్ణయించింది. అవి అత్యవస పరిస్థితులు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు
100% వరకు విత్ డ్రాయల్స్
ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు ఉద్యోగి, యాజమాన్యం వాటాతో సహా ప్రావిడెంట్ ఫండ్‌లోని అర్హత కలిగిన బ్యాలెన్స్‌లో 100% వరకు ఉపసంహరించుకోవచ్చు.
మరిన్ని విత్ డ్రాలు
సీబీటీ ఉపసంహరణ పరిమితులను సరళీకృతం చేసింది. విద్య సంబంధ అవసరాలకు ఇప్పుడు 10 సార్ల వరకు, వివాహం కోసం 5 సార్ల వరకు పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు. ఇవి గతంలో 3 సార్ల వరకే ఉండేవి.
12 నెలల తరువాత పాక్షిక ఉపసంహరణ
అన్ని పాక్షిక ఉపసంహరణలకు కనీసం ఉండాల్సిన సర్వీస్ కాలాన్ని ఏకరీతిగా 12 నెలలకు తగ్గించారు.
ప్రత్యేక పరిస్థితులకు ఎలాంటి కారణం అవసరం లేదు
'ప్రత్యేక పరిస్థితులలో' పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే ఇంతకు ముందు కారణాలు అంటే ప్రకృతి వైపరీత్యాలు, లాకౌట్లు / సంస్థల మూసివేత, నిరంతర నిరుద్యోగం, అంటువ్యాధి వ్యాప్తి మొదలైనవి సభ్యుడు స్పష్టం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు, సభ్యుడు ఈ కేటగిరీ కింద ఎటువంటి కారణాలు పేర్కొనకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
25 శాతం కనీస బ్యాలెన్స్ తప్పనిసరి
సభ్యుల ఖాతాలో 25% కాంట్రిబ్యూషన్‌ను కనీస బ్యాలెన్స్‌గా తప్పనిసరిగా ఉంచాలని నిబంధన తీసుకొచ్చారు.
100% ఆటో సెటిల్‌మెంట్
సభ్యులకు ఎక్కువ సౌలభ్యం కల్పించేందుకు సెటిల్‌మెంట్ నిబంధనలను ఈపీఎఫ్‌వో సరళీకృతం చేసింది. ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా, పాక్షిక ఉపసంహరణ కోసం క్లెయిమ్‌ల 100% ఆటో సెటిల్‌మెంట్‌ను ఈపీఎఫ్‌వో అనుసరించనుంది.
ముందస్తు ఫైనల్ సెటిల్‌మెంట్, పెన్షన్ ఉపసంహరణ
పదవీ విరమణ కాలం తీరకముందే ముందస్తు ఈపీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్‌ను పొందే వ్యవధిని ప్రస్తుతం ఉన్న 2 నెలల నుండి 12 నెలలకు, పైనల్ పెన్షన్ ఉపసంహరణను 2 నెలల నుండి 36 నెలలకు పెంచాలని సీబీటీ నిర్ణయించింది.