
ఈపీఎఫ్‌వో కింద నమోదైన సభ్యులు
5.55 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో ఉపాధి కల్పన జూలైలో బలంగా నమోదైంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కింద 21.04 లక్షల మంది సభ్యులు నికరంగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలో సభ్యుల చేరికతో పోల్చి చూస్తే 5.5 శాతం పెరుగుదల కనిపించింది. ఇందులో 9.79 లక్షల మంది కొత్తగా చేరిన సభ్యులు ఉన్నారు. ఉపాధి అవకాశాల పెరుగుదలను, ఉద్యోగుల భవిష్యనిధి ప్రయోజనాల పట్ల పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శనమని కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. జూలైలో నమోదైన కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసు వారు 5.98 లక్షల మంది ఉన్నారు.
మొత్తం కొత్త సభ్యుల్లో (9.79 లక్షలు) వీరు 61 శాతంగా ఉన్నారు. ఇదే వయసు నుంచి చేరిన నికర సభ్యులు మొత్తంగా 9.13 లక్షల మంది ఉన్నారు. 2024 జూలై నెలతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగారు. జూలైలో 45 శాతం సభ్యులు 18–25 ఏళ్ల నుంచి ఉండడం సంఘటిత రంగంలో ఉపాధి పెరుగుదలను సూచిస్తోంది. సుమారు 16.43 లక్షల మంది ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరొక సంస్థలో చేరినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. గతేడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూస్తే 12 శాతం మంది అధికంగా సంస్థలను మార్చినట్టు తెలుస్తోంది.
2.80 లక్షల మంది మహిళలు
జూలై నెలలో చేరిన నికర సభ్యుల్లో మహిళలు 4.42 లక్షల మంది కాగా, ఇందులో కొత్త సభ్యులు 2.80 లక్షలుగా ఉన్నారు. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే నికర సభ్యుల్లో పెరుగుదల కేవలం 0.17 శాతంగానే ఉంది. మొత్తం నికర సభ్యుల్లో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 20.47 శాతం మంది ఉన్నారు. తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, తెలంగాణ, యూపీ.. ఇలా ఒక్కో రాష్ట్రం నుంచి 5 శాతానికిపైనే సభ్యులు చేరారు. ఐరన్ ఓర్ మైనింగ్, యూనివర్సిటీలు, బీడీల తయారీ, వ్రస్తాల తయారీ, ఆస్పత్రులు, ట్రావెల్ ఏజెన్సీలు ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి.