
ఈపీఎఫ్ఓ (EPFO) డబ్బును ఏటీఎం (ATM) నుంచి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు.. కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ఏడాది ప్రారంభంలోనే పేర్కొన్నారు. ఇది జూన్ నుంచి అమలులోకి రానున్నట్లు గతంలో కొన్ని వార్తలు వినిపించినప్పటికీ.. ఈ సౌకర్యం 2026 జనవరికి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.
ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), వచ్చే నెల మొదటి అర్ధభాగంలో ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఆ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేపట్టే అవకాశం ఉంది. ఆ తరువాత ఏటీఎం నుంచి పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా అందుబాటులోకి వస్తుంది.
చందాదారులు తమ పీఎఫ్ డబ్బును తీసుకోవడం మరింత సులభతరం చేయడంలో భాగంగానే.. ఈపీఎఫ్ఓ 3.0 కింద ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ బ్యాంకులతో పాటు ఆర్‌బీఐతో కూడా మాట్లాడినట్లు సమాచారం.
ఇదీ చదవండి: డిజిటల్ చెల్లింపులకు కొత్త మార్గదర్శకాలు
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కార్పస్ మొత్తం రూ. 28 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంది. మొత్తం సహకార సభ్యులు దాదాపు 78 మిలియన్లు. అత్యవసర సమయంలో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ఓలో కొంత భాగాన్ని తీసుకోవాలంటే.. ఆన్‌లైన్‌లో అప్లై చేసి కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. ఇది కొంత ఆలస్యమైనా ప్రక్రియ. ఈ ఆలస్యానికి చెక్ పెట్టడానికే ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బును తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు.