మస్క్‌ కంపెనీలో ఉద్యోగం కావాలా? | elon musk xAI major hiring spree looking for engineers coders designers and more | Sakshi
Sakshi News home page

మస్క్‌ కంపెనీలో ఉద్యోగం కావాలా?

Jul 2 2025 12:15 PM | Updated on Jul 2 2025 12:24 PM

elon musk xAI major hiring spree looking for engineers coders designers and more

ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐలో నియామకాలు జోరుగా సాగుతున్నాయి. బ్యాకెండ్‌ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డిజైనర్లు, డేటా సైంటిస్టులు, లీగల్‌ ఎక్స్‌పర్ట్‌లు.. వంటి ఉద్యోగాల కోసం ఎక్స్‌ఏఐ తన ఎక్స్‌ ఖాతాలో ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం పాలో ఆల్టో, శాన్ ఫ్రాన్సిస్కో, మెంఫిస్‌లోని కార్యాలయాల్లో విస్తృత శ్రేణి ఉద్యోగాలను భర్తీ చేయాలని చూస్తోంది. కొన్ని పోస్టులు రిమోట్ దరఖాస్తుదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్ మనీ’ని అభివృద్ధి చేయడానికి చురుకుగా పనిచేస్తున్నట్లు ఎక్స్ఏఐ తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట​్‌ఫామ్‌ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎక్స్‌ యూజర్లు ప్లాట్‌ఫామ్‌ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్‌మెంట్‌.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్‌ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్‌లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు గతంలో తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.

ఇప్పటికే ‘వీసా’తో ఒ‍ప్పందం

వీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్‌లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్‌లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్‌లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ గతంలో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ర్యాపిడో.. ఓలా.. ఉబర్‌.. ఛార్జీలు పెంపు?

వేతనాలు ఇలా..

ఎక్స్‌ఏఐలో చేరే ఉద్యోగులకు ఏటా 2,20,000 డాలర్ల (సుమారు రూ.1.9 కోట్లు) నుంచి 4,40,000 డాలర్ల (సుమారు రూ.3.7 కోట్లు) వరకు పారితోషికం ఆఫర్‌ చేసింది. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ వంటి రంగాల్లో బలమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, సంక్లిష్టమైన ఆలోచనలను స్పష్టంగా కమ్యూనికేట్ చేసే సామర్థ్యం ఉన్న ఇంజినీర్లకు కంపెనీ మరింత చెల్లిస్తుందని ఎక్స్ఏఐ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement