ర్యాపిడో.. ఓలా.. ఉబర్‌.. ఛార్జీలు పెంపు? | Ola, Uber, Rapido platforms can charge up to 2x the base fare during peak hours | Sakshi
Sakshi News home page

ర్యాపిడో.. ఓలా.. ఉబర్‌.. ఛార్జీలు పెంపు?

Jul 2 2025 11:02 AM | Updated on Jul 2 2025 11:12 AM

Ola, Uber, Rapido platforms can charge up to 2x the base fare during peak hours

ఆన్‌లైన్‌ క్యాబ్‌ సర్వీసులు అందించే సంస్థలు పీక్‌ అవర్స్‌లో తమ ఛార్జీలను గరిష్ఠంగా 2 రెట్లు వరకు పెంచుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జులై 1న జారీ చేసిన మోటారు వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకాలు (ఎంవీఏజీ) 2025లో పేర్కొంది. ఇప్పటివరకు ఈ సర్జ్‌ ప్రైసింగ్‌ గరిష్ఠ పరిమితి 1.5 రెట్లు వరకు ఉండేది. దీన్ని తాజాగా 0.5 రెట్లు పెంచింది.

రాబోయే మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కంపెనీల కార్యకలాపాల కోసం అధిక డిమాండ్ ఉన్న సమయంలో ప్లాట్‌ఫామ్‌లకు సౌలభ్యాన్ని ఇవ్వడమే సవరించిన ఛార్జీల లక్ష్యంగా కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎంవీఏజీ 2025 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఆన్‌లైన్‌ క్యాబ్‌ అగ్రిగేటర్ల ద్వారా ప్రయాణాలకు రవాణాయేతర (ప్రైవేట్) మోటారు సైకిళ్లను ఉపయోగించడానికి అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని కట్టడి చేయడం, హైపర్ లోకల్ డెలివరీకి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు రవాణాయేతర మోటారు సైకిళ్లను వివిధ అగ్రిగేటర్ల ద్వారా అనుమతిస్తుంది. ఎంవీఏజీ 2025 మార్గదర్శకాల్లోని క్లాజ్ 23 ప్రకారం కంపెనీల నుంచి రోజువారీ, వారంవారీగా లేదా 15 రోజులకు ఒకసారి ఫీజు వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది.

ఇదీ చదవండి: 11 మంది టాప్‌ ఎక్స్‌పర్ట్‌లతో మెటా కొత్త ల్యాబ్‌

వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాపిడో, ఉబర్ వంటి బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు ఈ చర్యను స్వాగతిస్తున్నారు. ఈ నిబంధనను ‘వికసిత్‌ భారత్’ వైపు సాగే ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. మౌలికసదుపాయాలు అంతగాలేని  వెనుకబడిన ప్రాంతాల్లో సరసమైన రవాణాను విస్తరించడానికి ఈ మార్గదర్శకాలు సహాయపడుతాయని రాపిడో తెలిపింది. సవరించిన మార్గదర్శకాలపట్ల ఉబర్ హర్షం వ్యక్తం చేసింది.

కొత్త మార్గదర్శకాల్లోని కొన్ని ముఖ్యాంశాలు..

  • సర్జ్ ప్రైసింగ్ పరిమితి పెంపు: అధిక డిమాండ్ ఉన్న కాలంలో బేస్ ఛార్జీలను 1.5 రెట్ల నుంచి 2 రెట్లు పెంచారు.

  • పీక్ అవర్స్‌ కాని సమయంలో..: బేస్ ఛార్జీలో కనీసం 50% ఫేర్‌ ఉండాలి.

  • డెడ్ మైలేజ్ ఛార్జీలు: పికప్ దూరం 3 కిలోమీటర్ల కంటే ఎక్కవగా ఉన్నప్పుడు మాత్రమే విధించాలి.

  • రద్దు జరిమానాలు: డ్రైవర్ కారణం లేకుండా రైడ్‌ క్యాన్సిల్ చేస్తే రూ.100 లేదా 10% ఛార్జీ (ఏది తక్కువైతే అది) విధిస్తారు. స్వయంగా క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులకు కూడా ఇదే వర్తిస్తుంది.

  • డ్రైవర్ సంక్షేమం: రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.

  • భద్రతా చర్యలు: రైడ్‌ వాహనాలకు స్టేట్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించిన లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement