
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.
డేటా లేబులింగ్ స్టార్టప్ స్కేల్ ఏఐ మాజీ సీఈఓ అలెగ్జాండర్ వాంగ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగానికి చీఫ్ ఏఐ ఆఫీసర్‌గా వాంగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బ్లూమ్‌బర్గ్‌లోని వివరాల ప్రకారం.. ఉద్యోగులకు పంపిన మెమోలో జుకర్‌బర్గ్ వాంగ్‌ను ‘ఈ తరం అత్యంత ఆకట్టుకునే వ్యవస్థాపకుడు’ అని అభివర్ణించారు. వాంగ్‌తోపాటు గిట్ హబ్ మాజీ సీఈఓ నాట్ ఫ్రీడ్ మన్ కూడా ఈ బృందంలో చేరనున్నారు. కృత్రిమ మేధ ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, అనువర్తిత పరిశోధనలపై ఫ్రీడ్ మన్ దృష్టి సారించనున్నారు.
అగ్రశ్రేణి పరిశోధకులు
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, మెటా తన ప్రత్యర్థుల నుంచి 11 మంది అగ్రశ్రేణి ఏఐ పరిశోధకులను నియమించుకుంది. ఎంఎస్‌ఎల్ కోసం మెటాలో చేరినవారి వివరాలను వైర్డ్ తెలిపింది. ఇందులో ఓపెన్ ఏఐ ఓ-సిరీస్ మోడళ్ల సృష్టికర్త ట్రాపిట్ బన్సాల్, జీపీటీ-4 ఓ వాయిస్, మల్టీమోడల్ పోస్ట్ ట్రైనింగ్‌లో పాల్గొన్న షుచావో బీ, గూగుల్ రీసెర్చ్‌లో ఇమేజ్ జనరేషన్ టూల్స్ అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందిన హుయ్వెన్ చాంగ్, జీపీటీ-4 మోడల్స్, రీజనింగ్ సిస్టమ్‌లకు కంట్రిబ్యూటర్ అయిన జీ లిన్ ఉన్నారు. గూగుల్ నుంచి జాక్ రే, జోహాన్ షాల్‌క్విక్, పీ సన్, ఓపెన్ఏఐకి చెందిన హాంగ్యు రెన్, జియాహుయి యు, షెంగ్జియా ఝావో.. వంటి ప్రముఖులున్నారు.

ఇదీ చదవండి: టెస్లా షేర్లు భారీగా కుదేలు
భారీ ప్యాకేజీలు..
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్‌ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్‌పర్ట్‌లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.