ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరుగుతున్న సమయంలో.. ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. స్పేస్ఎక్స్ఏఐ అనే స్పేస్‌ఎక్స్‌కు సంబంధించిన ఏఐ కార్యకలాపాలను స్పేస్ఎక్స్ఎస్ఐ(SpaceXSI)గా మార్చాలని సూచించారు.
ఇక్కడ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మస్క్ మాత్రం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందిన మేధస్సును సూచించడానికి ఎస్ఐ (సూపర్ ఇంటెలిజెన్స్) అనే పదాన్ని సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ఏఐని సూపర్ ఇంటెలిజెన్స్ అనే పదంతో ప్రస్తావించడాన్ని ప్రోత్సహించారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ''నో మోర్ ఏఐ, ఎస్ఐ అనేది బెటర్'' అని అన్నారు.
No more AI SI It’s better
— Elon Musk (@elonmusk) October 4, 2026
భారీగా పెరిగిన మస్క్ సంపద
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా మరోసారి ఒక ట్రిలియన్ డాలర్లు సంపదను దాటారు. ఆయన సంపద పెరగడానికి ప్రధాన కారణం.. టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల విలువలు గణనీయంగా పెరగడమే అని తెలుస్తోంది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. సోమవారం ఒక్కరోజులోనే మస్క్ సంపద సుమారు 65 బిలియన్ డాలర్లు పెరిగి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో టెస్లా షేర్లు, స్పేస్ఎక్స్ విలువ రెండూ పెరిగాయి. అక్టోబర్ ప్రారంభం నుంచి స్పేస్ఎక్స్ విలువ సుమారు 13 శాతం, టెస్లా షేర్ విలువ సుమారు 6.7% పెరిగాయి.
ప్రస్తుతం మస్క్ సంపద.. ప్రపంచంలోని ఇతర బిలియనీర్ల కంటే చాలా ఎక్కువగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, రెండో స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (371.5 బిలియన్ డాలర్లు) ఉన్నారు. అంటే.. మస్క్ సంపద బెజోస్ సంపద కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
ఇదీ చదవండి: కొడుకు ఆస్తిపై తండ్రికి హక్కు లేదా?.. చట్టం ఏం చెబుతుందంటే!


