
1.8 లక్షల ద్విచక్ర వాహనాలు
రెండో స్థానంలో 22వేలకు పైగా కార్లు..
లైఫ్ ట్యాక్స్, ఫీజుల రూపంలో రూ.91.93 లక్షల రాయితీ
చార్జింగ్ కేంద్రాలు పెరిగితే మరిన్ని రయ్ రయ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ– బండి టాప్‌గేర్‌లో పరుగులు తీస్తోంది. ఈవీలపై జీవితకాల పన్ను మినహాయింపుతో ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షకుపైగా ద్విచక్ర వాహనాలు, 22 వేల కార్లు రోడ్డెక్కాయి. కొంతకాలంగా ఈ రెండు కేటగిరీలకు చెందిన వాహనాల అమ్మకాలు ఊపందుకున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి.
ఈ సంవత్సరం కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరిగేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు భారంగా మారుతున్న దృష్ట్యా సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్రమంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారుతున్నారు. గ్రేటర్‌లో ఈ నెల 10 నాటికి 1,88,549 ద్విచక్ర వాహనాలు, 22,365 కార్లు నమోదైనట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కొత్తగా 5,097 ఆటోలు, మరో 5,363 తేలికపాటి వస్తు రవాణా వాహనాలు రోడ్డెక్కాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,21,374 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు నమోదైనట్లు అధికారులు చెప్పారు.
ఈ వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో వాహనదారులకు రూ.91.93 లక్షల రాయితీ లభించింది. ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రతి మూడు నెలలకోసారి విధించే క్వార్టర్లీ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు లభించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకాశాన్ని వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జేటీపీ రమేష్ సూచించారు.
