దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటి పౌరుల కోసం కొత్త కనీస వేతనాన్ని ప్రకటించింది. 2026 జనవరి 1 నుండి, ఎమిరాటి ఉద్యోగులకు నెలకు కనీసం 6,000 యూఏఈ దిర్హామ్‌లు (సుమారు రూ.1.48 లక్షలు) ఇవ్వడం తప్పనిసరి. ఇంతకు ముందుక ఇది 5,000 దిర్హామ్‌లుగా (రూ.1.23 లక్షలు) ఉండేది.
ఈ నిర్ణయం ప్రైవేట్ రంగంలో ఎమిరాటీలకు అధికారిక వేతన అంతస్తును ఏర్పరచడం ద్వారా ఉద్యోగ ప్రమాణాలను బలోపేతం చేస్తుంది. కొత్త, పునరుద్ధరించిన, లేదా సవరించిన వర్క్ పర్మిట్లకు ఈ వేతన అంతస్తు వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న ఎమిరాటి ఉద్యోగుల వేతనాలను 2026 జూన్ 30 నాటికి సవరించాల్సి ఉంటుంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే..
2026 జూలై 1 నుండి కనీస జీతాల మార్గదర్శకాలను పాటించని కంపెనీలపై కఠిన చర్యలు ఉంటాయి. ఇందులో ఎమిరటైజేషన్ కోటాల నుండి తొలగించడం, కొత్త వర్క్ పర్మిట్లను నిలిపివేయడం వంటివి ఉంటాయి.
ప్రవాస కార్మికులకు వర్తిస్తుందా?
ఈ కొత్త కనీస వేతనం కేవలం యూఏఈ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. భారతీయులతోపాటు ఇతర ప్రవాస కార్మికులకు అధికారిక కనీస వేతనం వర్తించదు. ప్రవాస కార్మికుల వేతనాలు పరిశ్రమ, నైపుణ్యం, ఒప్పందాల ఆధారంగా మారుతూ వస్తాయి. అయితే, కార్మిక చట్టాల ప్రకారం ప్రాథమిక జీవన అవసరాలు తీర్చేలా యజమానులు వేతనాలను కేటాయించాలి.
వేతన మార్గదర్శకాలు
మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) కొన్ని వర్గాల ఉద్యోగుల కోసం సిఫార్సు చేసిన వేతన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లకు కనీస జీతం నెలకు 12,000 దిర్హామ్‌లు, డిప్లొమా/టెక్నీషియన్లకు 7,000 దిర్హామ్‌లు, సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ ఉన్న నైపుణ్య కార్మికులకు 5,000 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది.


