
పోటీ ధరలకే ఉత్పత్తులు అందిస్తాం
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ సీఈవో
అస్సెట్ మేనేజ్‌మెంట్ విభాగంలో జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్ల అవసరాలను తాము మెరుగ్గా అర్థం చేసుకోగలమని, పోటీ ధరలపైనే ఉత్పత్తులను అందించగలమని ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. కొత్త సంస్థల రాకతో మార్కెట్ మరింత విస్తరిస్తుందన్న అభిప్రాయాన్ని ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ జాయింట్ సీఈవో డీపీ సింగ్ వ్యక్తం చేశారు. దీంతో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ సైతం లబ్ధి పొందుతుందన్నారు.
‘వారు విజయవంతం కావాలనుకుంటారు. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదే సమయంలో మాకు అనుభవం ఉంది. ఇన్వెస్టర్ల స్పందన, నాడి మాకు తెలుసు. ఇవన్నీ కొత్త సంస్థకు తెలియాలంటే కొంత సమయం పడుతుంది’అని సింగ్ పేర్కొన్నారు. జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ మొదటిసారి ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను, కేవలం 0.50 శాతం ఎక్స్‌పెన్స్ రేషియోకి తీసుకురావడంపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ సైతం ఇదే మాదిరి లేదా ఇంతకంటే తక్కువ ధరపైనే ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల డైరెక్ట్ ప్లాన్లలో ఎక్స్‌పెన్స్ రేషియోని పరిశీలిస్తే ఇది తెలుస్తుందన్నారు.
మాగ్నం సిఫ్
స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సిఫ్) విభాగంలో ‘మాగ్నం సిఫ్’ పేరుతో ఎస్‌బీఐ తొలి పథకాన్ని ప్రారంభించింది. ఇందులో కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనీసం 15,000 మంది ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెడతారని అంచనా వేస్తున్నట్టు సింగ్ తెలిపారు. రిటైర్మెంట్ తీసుకున్నవారు, దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టే వారికి దీన్ని ఆఫర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మాగ్నం సిఫ్ అక్టోబర్ 1న ప్రారంభం అవుతుందని, అదే నెల 15న ముగుస్తుందని తెలిపారు. కనీసం రెండేళ్ల పాటు పెట్టుబడులు కొనసాగిస్తే మెరుగైన రాబడులు వస్తాయన్నారు.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!