
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1, 2025 నుంచి అర్హులైన ఉద్యోగుల్లో 80 శాతం మందికి వేతన పెంపును అమలు చేయనుంది. 2025 ద్వితీయార్ధంలో చాలా మంది ఉద్యోగులకు మెరిట్ ఆధారిత వేతన పెంపును అందించే ప్రణాళికలను కంపెనీ తన రెండవ త్రైమాసిక ఆదాయ ప్రకటనలో ధృవీకరించింది.
సీనియర్ అసోసియేట్ స్థాయి వరకు ఉన్న ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రతినిధి పీటీఐకి తెలిపారు. పెంపు శాతం వ్యక్తిగత పనితీరుతో పాటు ఉద్యోగి స్థానంపై ఆధారపడి ఉంటుంది. భారత్ ఉద్యోగులలో నిలకడ పనితీరు చూపినవారికి సింగిల్ డిజిట్‌లో, అసాధారణ పనితీరు కనబరిచిన వారికి గణనీయమైన ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

పెరిగిన నికర లాభం
నాస్‌డాక్‌లో లిస్టైన కాగ్నిజెంట్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగి 2025 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 645 మిలియన్ డాలర్లకు చేరుకుంది. త్రైమాసిక ఆదాయం 8.1 శాతం పెరిగి 5.25 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇతర కంపెనీల్లో ఇలా..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెప్టెంబర్ 1 నుండి దాదాపు 80% మంది ఉద్యోగులకు వేతనాలు పెంచే ప్రణాళికలను ఇటీవలె వెల్లడించింది. నివేదికల ప్రకారం.. ఆఫ్‌షోర్ ఉద్యోగులు 6–8% వరకు, ఆన్‌షోర్ ఉద్యోగులు 2–4% వరకు పెరుగుదల ఉండవచ్చు. ఇక విప్రో, ఇన్ఫోసిస్ 2025లో వేతన పెంపు ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు.
👉 ఇది చదివారా? రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్‌కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్