ప్రపంచ పానీయాల దిగ్గజం ‘ది కోకా-కోలా కంపెనీ’కి చెందిన ప్రముఖ డైరీ బ్రాండ్ ఫెయిర్‌లైఫ్ ర్యాన్సమ్‌వేర్ సైబర్ దాడికి గురైంది. అమెరికాలోని ఫెయిర్‌లైఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్లపై హ్యాకర్లు విరుచుకుపడటంతో ఆ దేశవ్యాప్తంగా డైరీ ఉత్పత్తుల తయారీ ప్రక్రియను యాజమాన్యం తాత్కాలికంగా పూర్తిస్థాయిలో నిలిపివేసింది. ఈ సైబర్ అటాక్ వివరాలను కోకా-కోలా సంస్థ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కి సమర్పించిన ఫార్మ్ 8-కే ఫైలింగ్‌లో అధికారికంగా ధ్రువీకరించింది.
ఉత్పత్తి నిలిపివేత
హ్యాకర్లు ఫెయిర్‌లైఫ్ నెట్‌వర్క్‌లోకి అక్రమంగా ప్రవేశించి నాణ్యతా నియంత్రణ, తయారీకి సంబంధించిన ఆపరేషనల్ టెక్నాలజీ వ్యవస్థలను సైతం ప్రభావితం చేశారు. నాణ్యత, సాంకేతిక భద్రతపై అనిశ్చితి నెలకొనడంతో సంస్థ ముందస్తు జాగ్రత్తగా సరఫరా వ్యవస్థలను నిలిపివేసింది.
అమెరికాలోని ఫెయిర్‌లైఫ్ ఉత్పత్తి కేంద్రాలన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయి. కెనడాలోని ఫెయిర్‌లైఫ్ ఉత్పత్తి కేంద్రాలు యథాతథంగా పనిచేస్తున్నాయి. ఈ దాడి వల్ల వినియోగదారులకు చేరిన ఉత్పత్తుల నాణ్యత లేదా భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని కోకా-కోలా స్పష్టం చేసింది. విదేశీ సైబర్ భద్రతా నిపుణుల సాయంతో ‘ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రోటోకాల్స్’ ప్రారంభించారు. చట్టబద్ధమైన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు సమాచారం అందించారు.
బిలియన్ డాలర్ల బ్రాండ్‌పై సైబర్ పంజా
ఏటా దాదాపు 4 బిలియన్ డాలర్ల (రూ.33,000 కోట్లకు పైగా) విక్రయాలు జరిపే ఫెయిర్‌లైఫ్ బ్రాండ్‌పై ఈ రకమైన డిజిటల్ దాడి జరగడం ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాన్ని షాక్‌కు గురిచేసింది. హ్యాకర్లు 1టీబీ మేర సున్నితమైన కార్పొరేట్ డేటాను చోరీ చేశారనే నివేదికలు వస్తున్నప్పటికీ కోకా-కోలా స్పందిస్తూ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఆర్థిక పరిణామాలను అంచనా వేస్తున్నామని తెలిపింది.
సైబర్ సెక్యూరిటీ విశ్లేషణ.. పరిశ్రమకు హెచ్చరిక
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కేవలం ఐటీ డేటా వ్యవస్థలనే కాకుండా తయారీ పరిశ్రమల్లో ఉత్పత్తులను నేరుగా నడిపించే ఆపరేషనల్ టెక్నాలజీ సాధనాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక ఉత్పత్తి ప్లాంట్ నిలిచిపోతే సరఫరా గొలుసు విచ్ఛిన్నమై కంపెనీలకు వందల మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. ఆధునిక తయారీ రంగాలు తమ ఐటీ, ప్రొడక్షన్ నెట్‌వర్క్‌ల డిజిటల్ భద్రతను అత్యంత కఠినంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫెయిర్‌లైఫ్ ఉదంతం మరోసారి గుర్తుచేసింది.


