భారత పౌరుల ఆధార్ డేటా భద్రతపై హాట్ మెయిల్ కోఫౌండర్ సబీర్ భాటియా సంచలన ఆరోపణలు చేశారు. పౌరుల ఆధార్ డేటా దుర్వినియోగం అయ్యి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రిప్టో నేరస్తులు ఈ డేటాను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ సబీర్ భాటియా ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
‘మొత్తం ఆధార్ డేటాబేస్ను క్రిప్టో నేరస్థులు దొంగిలించినట్లు ఓ కథనం ఉంది. 815 మిలియన్ల మంది డేటాను 80,000 డాలర్లకు అమ్మేసినట్లు చెబుతున్నారు. ఇది నిజమో కాదో నేను ధృవీకరించలేను... కానీ ఇది లోతైన సాంకేతిక నైపుణ్యం లేకుండా సంక్లిష్టమైన వ్యవస్థలను రూపొందించడం వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా ఆధార్ సంబంధిత సంఘటనను ప్రపంచంలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘనగా అభివర్ణించింది’ భాటియా తన పోస్ట్లో పేర్కొన్నారు.
భారత ఆధార్ డేటా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయన పెట్టిన ప్రతిస్పందనల వరదకు దారితీసింది. కొంత మంది ఆయన వాదనను సమర్థించగా మరికొంత మంది విమర్శించారు. ఇలా ఆధారాలు లేకుండా అనుమానాలను కల్పించడం వెనుక ఆయన ఉద్దేశాలను ప్రశ్నించారు. ఆధారాలు లేనప్పుడు పబ్లిక్ ప్లాట్ ఫామ్ లపై రాయడం మానుకోండి అంటూ హితవు పలికారు.
సబీర్ భాటియా ఆధార్ వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆధార్ డిజైన్, వ్యయంపై ఆయన గతంలోనూ విమర్శలు చేశారు. గత ఫిబ్రవరిలో ఓ పోడ్ కాస్ట్ లో భాటియా మాట్లాడుతూ ఆధార్ నిర్మాణానికి 1.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారని, కానీ 20 మిలియన్ డాలర్లతోనే దీన్ని చేసి ఉండవచ్చిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆధార్ కోసం ఉపయోగిస్తున్న బయో మెట్రిక్స్పై అనుమానం వ్యక్తం చేసిన ఆయన వీడియో, వాయిస్ ఆథెంటికేషన్ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలను సూచించారు.
There’s a story doing the rounds that the entire Aadhaar database has been stolen by crypto criminals, with data of 815M people reportedly on sale for $80,000. I can’t confirm if this is true… but it does highlight the risks of designing complex systems without deep technical…
— Sabeer Bhatia (@sabeer) November 19, 2025


