సమర్థంగా తిప్పికొట్టిన సెంట్రల్ బ్యాంక్
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెబ్‌సైట్‌పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2025) ఏకంగా 6.1 కోట్లకు పైగా సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు ఆర్‌బీఐ అధికారికంగా వెల్లడించింది. అయితే, అత్యాధునిక రక్షణ వ్యవస్థల కారణంగా ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఎటువంటి డేటా ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.
మూడొంతులు పెరిగిన దాడుల తీవ్రత
గత ఏడాది కాలంగా ఆర్‌బీఐ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే సైబర్ ముప్పు ఏ స్థాయిలో పొంచి ఉందో అర్థమవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - జూన్ మధ్య 1.9 కోట్లు, జులై - సెప్టెంబర్ మధ్య 3.1 కోట్లు, అక్టోబర్ - డిసెంబర్ మధ్య 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు జరిగాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే దాడుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. దేశ కేంద్ర బ్యాంక్ కావడంతో దీని ప్రాముఖ్యత దృష్ట్యా హ్యాకర్లు నిరంతరం సాఫ్ట్‌వేర్లలో చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న శక్తివంతమైన ఫైర్‌వాల్‌లు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఈ ముప్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
రక్షణ వ్యవస్థలో ఏఐ విప్లవం
పెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ తన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌లో కృత్రిమ మేధస్సు సాంకేతికతను అనుసంధానించింది. ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వాసుదేవన్ తెలిపిన వివరాల ప్రకారం.. వెబ్‌సైట్‌లోకి వచ్చే ప్రతి విజిటర్ డేటాను ఏఐ విశ్లేషిస్తుంది. సాధారణ వినియోగదారులకు, హ్యాకర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే బ్లాక్ చేస్తుంది. దాడి తీవ్రరూపం దాల్చకముందే దాని మూలాలను గుర్తించి అడ్డుకుంటుంది.
భవిష్యత్తు ప్రణాళికలు
రాబోయే రోజుల్లో వ్యవస్థలో ఏఐ పాత్రను మరింత విస్తృతం చేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది. కేవలం భద్రతకే పరిమితం కాకుండా.. మోసపూరిత లావాదేవీలను క్షణాల్లో గుర్తించడం. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్ల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఏఐ చాట్‌బాట్‌లను మరింత అభివృద్ధి చేయడం వంటి విధానలు తీసుకురానున్నారు.
ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?


