ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా వేసవిలో తీవ్ర ఉష్ణగాలులు (హీట్‌వేవ్స్) వీస్తున్న వేళ బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే పారిశ్రామిక, నిర్మాణ రంగ కార్మికుల ఆరోగ్య భద్రత అంతర్జాతీయంగా ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా జపాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా సంస్థ ‘ట్రస్కో నకాయామ కార్పొరేషన్’ వినూత్న పరికరాన్ని ఆవిష్కరించింది. తీవ్రమైన వేడిలో పనిచేసే కార్మికుల శరీర ఉష్ణోగ్రతను కేవలం 5-10 నిమిషాల్లోనే చల్లబరిచే ‘డూ రేమొన్ బాక్స్’ అనే ఫ్రీజర్ బూత్‌ను రూపొందించింది. సాధారణ పరిభాషలో దీన్ని ‘హ్యూమన్ రెఫ్రిజిరేటర్’ అని పిలుస్తున్నాయి.
పనిచేసే విధానం..సాంకేతిక పరిజ్ఞానం
ఈ డూ రేమొన్ బాక్స్ అనేది స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైన ఒక పోర్టబుల్ కేబిన్. కార్మికుడు ఈ కేబిన్ లోపల కూర్చున్న వెంటనే ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దకు వెళ్తుంది. శరీర ఉష్ణోగ్రతను వేగంగా నియంత్రించే ప్రధాన భాగాలైన మెడ, తల, వీపు భాగాలను లక్ష్యంగా చేసుకుని 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన చల్లని గాలి ధారలను ఈ పరికరం వేగంగా చిమ్ముతుంది. అతిగా చల్లబడటం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ శీతలీకరణ సమయాన్ని గరిష్టంగా 20 నిమిషాలకు పరిమితం చేస్తూ ఆటోమేటిక్ టైమర్‌ను అమర్చారు.
ఫ్రోజెన్ ఫుడ్ సాంకేతికతతో రూపకల్పన
ఐస్ క్రీమ్‌లు, ఫ్రోజెన్ ఆహార పదార్థాలను నిల్వ చేసే వెండింగ్ మెషిన్ రిఫ్రిజిరేషన్ సాంకేతికత ఆధారంగా జపాన్ ఇంజినీర్లు ఈ పరికరాన్ని డిజైన్ చేశారు. దీనికి ఎటువంటి శాశ్వత నిర్మాణాలు లేదా ఇన్స్టాలేషన్లు అవసరం లేదు. సాధారణ 100-వోల్ట్ పవర్ సప్లైతో ఇది పనిచేస్తుంది. కింద చక్రాలు ఉండటం వల్ల కన్‌స్ట్రక్షన్ సైట్లు, ఫ్యాక్టరీలు, వేర్‌హౌస్‌లు, రోడ్డు నిర్మాణ ప్రాంతాలకు సులభంగా తరలించవచ్చు.
జపాన్‌లో వేసవి తీవ్రత కారణంగా ఏటా వేలాది మంది వడదెబ్బ బారినపడుతున్నారు. ఈ క్రమంలో కార్మికుల సురక్షిత పనివేళల నిర్వహణకు ఈ పరికరం ఎంతగానో తోడ్పడుతుంది. ఇది నేరుగా వడదెబ్బకు వైద్య చికిత్స కాకపోయినప్పటికీ పని వేళల మధ్య లభించే స్వల్ప విరామాల్లో కార్మికులకు తక్షణ ఉపశమనం అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్న భారత్ వంటి ఉష్ణమండల దేశాల్లోని నిర్మాణ, పారిశ్రామిక రంగాలకు కూడా ఇటువంటి పోర్టబుల్ కూలింగ్ బూత్‌లు రాబోయే రోజుల్లో ప్రాధాన్యమైనవిగా మారనున్నాయి.
ఇదీ చదవండి: కోకా-కోలా ‘ఫెయిర్‌లైఫ్’పై సైబర్ దాడి


