కోతల రాయుళ్లకు వాతలు తప్పవు! | claim tax deductions need documents based on the deduction type | Sakshi
Sakshi News home page

కోతల రాయుళ్లకు వాతలు తప్పవు!

Jun 16 2025 12:51 PM | Updated on Jun 16 2025 12:51 PM

claim tax deductions need documents based on the deduction type

ఐటీఆర్‌ 1, ఐటీఆర్‌ 4లలో కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ మీరు ఐటీఆర్‌ దాఖలు చేసే 2024–25 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. ఈ మార్పుల ప్రకారం క్లెయిం చేసే ప్రతి డిడక్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అప్‌లోడ్‌ చేయాలి. ఇన్నాళ్లు డిడక్షన్‌ ఎంతో రాసిస్తే వదిలేసేవారు. ఇక నుంచి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే. దీని ప్రకారం ఒక్కొక్క డిడక్షన్, దానికి సంబంధించిన కాగితాలు/వివరాలు ఏమిటో తెలుసుకుందాం. మీ దగ్గర పూర్తి వివరాలు లేనిదే ఫారం నింపలేరు. ఇంటి అద్దె అలవెన్సు.. బేసిక్‌ జీతం. ఇంటి అద్దె అలవెన్సు ఎంత చేతికి వచ్చింది. మీరు అద్దె ఎంత చెల్లించారు. అద్దె ఎవరికి ఇచ్చారు. ఎలా ఇచ్చారు. అంటే నగదా..? బ్యాంకు ద్వారానా..? రశీదులు మొదలైనవి.

80 సీ.. ఇంతకుముందే తెలుసుకున్నాము. ఈ సెక్షన్‌ క్రింద ఎన్నో అంశాలున్నాయి. ముఖ్యంగా పాలసీ నెంబరు చెప్పాలి. అలాగే మిగతా ఇన్వెస్ట్‌మెంట్లకు, డాక్యుమెంటు ఐడెంటిఫికేషన్‌ నెంబరు రాయాలి. మిగతా వాటి గురించి ఇక్కడ ప్రస్తావించలేదు కానీ క్లెయిం చేసే ముందు కాగితాలు సిద్ధంగా పెట్టుకోవాలి. చెల్లింపు తేదీలు, అది ఏ సంవత్సరానికి సంబంధించినదో చాలా ముఖ్యం. ఈ సెక్షన్‌లో డిడక్షన్లు చెల్లింపు జరిగిన సంవత్సరంలోనే బెనిఫిట్‌ ఇస్తారు.

  • 80 డీ.. ఇది మెడికల్‌ ఇన్సూరెన్స్‌కి సంబంధించినది. ఇన్సూరెన్స్‌ కంపెనీ పేరు, పాలసీ నెంబరు వివరాలు ఇవ్వాలి.  

  • 80 ఈ... ఇది విద్యా రుణానికి సంబంధించినది. ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు..?  లోన్‌ అకౌంటు నెంబరు.., మంజూరు తేది .. 
    ఎంత రుణం తీసుకున్నారు.. ఇంకా 
    ఎంత రుణం చెల్లించాలి .. ఇలా వివరాలన్నీ తెలియపరచాలి.  

  • 80 ఈఈ... ఇంటి కోసం రుణం తీసుకుంటే కొన్ని షరతులకు లోబడి రూ.50,000 డిడక్షన్‌ ఇస్తారు. ఈ రుణానికి సంబంధించి బ్యాంకు, లోన్‌ అకౌంటు నెంబరు, మంజూరు లెటర్‌ తేదీ, ఎంత రుణం తీసుకున్నారు..? ఇంకా ఎంత రుణం మిగిలి ఉంది. ఇవన్నీ వివరాలు చెప్పాలి.  

  • 80 ఈఈబీ... ఇది ఎలక్ట్రిక్‌ వెహికల్‌ లోన్‌కి సంబంధించినది. బ్యాంకు పేరు ఏమిటి..? లోన్‌ అకౌంటు నెంబరు, లోన్‌ ఎంత, వెహికల్‌ రిజి్రస్టేషన్‌ నెంబరు, లోన్‌ మొత్తం ఎంత..? మొదలైన వివరాలు ఇవ్వాలి.

  • 80 డీడీబీ... ఇది కొన్ని నిర్దేశిత జబ్బుల ట్రీట్‌మెంట్‌కి సంబంధించినది. ఆ నిర్దేశిత జాబితాలోంచి ఏ జబ్బు వచ్చింది? దానికైన ఖర్చు.., హాస్పిటల్‌కి చెల్లించిన మొత్తం ఎంత? తదితర పూర్తి వివరాలు తెలిపాలి.  

ఈ మార్పులతో అన్ని విషయాలు సేకరిస్తున్నారన్నమాట. ఒకప్పుడు మన మీద అభిమానం, నమ్మకం, మంచి విశ్వాసంతో మొత్తాన్ని తెలియజేయమనేవారు. దీనిని ఆసరా తీసుకుని అన్ని సెక్షన్ల ప్రకారం అర్హత ఉన్నంత క్లెయిమ్‌ల కోసం జనాలు ఎగబడుతున్నారు. అద్దె ఇంట్లో లేకుండా అద్దె క్లెయిమ్‌ చేసే ఉద్యోగస్తులు ఎందరో ఉన్నారు. భార్యభర్తలు ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరూ విడిగా వారి వారి అస్సెస్‌మెంట్లలో హెచ్‌ఆర్‌ఏ క్లెయింలు చేసే ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్స్‌’ ఎంతోమంది ఉన్నారు. 

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..

ఒక్క హెచ్‌ఆర్‌ఏ విషయంలోనే డిపార్ట్‌మెంట్‌ వారు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే కొంప కొల్లేరు అయిపోతుంది. అలాగే దొంగ స్కూల్‌ ఫీజుల రశీదులు .. పిల్లలు లేని వారు కూడా దొంగ రశీదులు పెడుతున్నారు. జీవిత బీమా చెల్లించకపోయినా ప్రీమియంలు చెల్లించినట్లు రాయడం, లేని చెల్లింపులు, లేని ఇన్వెస్ట్‌మెంట్లు, లేని అంగవైకల్యం దొంగ పత్రాలు సృష్టించి తద్వారా క్లెయిమ్‌లు పొందడం లాంటివి చేసేవారున్నారు.   డిపార్ట్‌మెంట్‌ చాలా స్ట్రిక్ట్‌గా ఉందని తిట్టి, ప్రచారం చేసి డిపార్ట్‌మెంట్‌ వారి మీద అపవాదాలు వేసి, పిడివాదన చేసి, వాదనలు, ప్రతివాదనలు చేసి, పన్నుభారం తగ్గించుకునే కోతరాయుళ్లకి వాతలు తప్పవు.

కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య

ట్యాక్సేషన్‌ నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement