షాన్‌జై: చైనా ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ఎవర్‌గ్రాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా వెలిగిన ఎవర్‌గ్రాండ్ వ్యవస్థాపకుడు హుయ్ కా యాన్‌కు చైనా కోర్టు జీవిత ఖైదు విధించింది. భారీ ఆర్థిక మోసాలు, లంచాలు, నిధుల దుర్వినియోగం సహా ఎనిమిది నేరాలను అంగీకరించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది.
1996లో స్థాపించిన ఎవర్‌గ్రాండ్ చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. అయితే 2016–2021 మధ్య కంపెనీ ఆస్తులను కృత్రిమంగా పెంచి చూపడం, అప్పులను దాచిపెట్టడం, పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడం వంటి అక్రమాలకు పాల్పడిందని దర్యాప్తులో తేలింది. దీంతో సంస్థపై వేల కోట్ల యువాన్ల ఆర్థిక మోసాల కేసులు నమోదయ్యాయి.
జీవిత ఖైదుతో పాటు ఆస్తుల జప్తు
షెన్‌జెన్ మధ్యంతర ప్రజా న్యాయస్థానం హుయ్ కా యాన్‌కు జీవిత ఖైదు విధించడమే కాకుండా ఆయన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని ఆదేశించింది. ఎవర్‌గ్రాండ్ గ్రూప్‌కు 8.82 బిలియన్ యువాన్, దాని అనుబంధ సంస్థ హెంగ్డాకు 7 బిలియన్ యువాన్ జరిమానా విధించారు. మరో 56 మంది మాజీ అధికారులు కూడా వివిధ కాలాల జైలు శిక్షలు పొందారు.
చైనా ఆర్థిక సంక్షోభానికి ప్రతీక
2021లో ఎవర్‌గ్రాండ్ సుమారు 300 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో డిఫాల్ట్ కావడంతో (రుణాలు చెల్లించలేక చేతులెత్తేయడంతో) చైనా రియల్ ఎస్టేట్ రంగం కోలుకోలేని సంక్షోభంలోకి కూరుకుపోయింది. వేలాది మంది గృహ కొనుగోలుదారులు, చిన్న పెట్టుబడిదారులు తాము దాచుకున్న సొమ్మును కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ పరిణామం దేశ ఆర్థిక వృద్ధిని తీవ్రంగా దెబ్బతీసింది. హాంకాంగ్ కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ కంపెనీ లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్నప్పటికీ బాధితులకు, రుణదాతలకు రావాల్సిన సొమ్ములో అతిస్వల్ప భాగం మాత్రమే ఇప్పటివరకు రికవరీ అయింది.
బిలియనీర్ నుంచి ఖైదీ వరకు…
2017లో హుయ్ కా యాన్ సంపద 45 బిలియన్ డాలర్లకు పైగా చేరి ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచాడు. కానీ ఐదేళ్లలోనే అదే వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలి, ఇప్పుడు జీవితాంతం జైలుకు చేరడం చైనా కార్పొరేట్ చరిత్రలో అత్యంత సంచలన పతనాల్లో ఒకటిగా నిలిచింది


