స్టాక్‌మార్కెట్‌లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్‌ ట్రేడింగ్‌’! | NSE Plans Trade Own Shares NSE Platform | Sakshi
Sakshi News home page

స్టాక్‌మార్కెట్‌లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్‌ ట్రేడింగ్‌’!

Aug 20 2026 4:37 PM | Updated on Aug 20 2026 5:32 PM

NSE Plans Trade Own Shares NSE Platform

దేశంలో అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజీ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) తన షేర్లను సొంత ప్లాట్‌ఫామ్‌పై ట్రేడింగ్‌కు అనుమతించే మార్గాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్‌ మార్కెట్‌లో లిస్టయిన సంస్థ కాదు. ప్రతిపాదిత ఐపీవో ద్వారా షేర్లను బీఎస్‌ఈలో లిస్ట్‌ చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే బీఎస్‌ఈలో ప్రాథమిక లిస్టింగ్‌ కొనసాగిస్తూ, ఎన్‌ఎస్‌ఈలోనూ షేర్ల ట్రేడింగ్‌కు అనుమతి పొందేందుకు ‘పర్మిటెడ్‌ టు ట్రేడ్‌’ (PTT) మార్గాన్ని ఉపయోగించాలని ఎన్‌ఎస్‌ఈ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌ వెల్లడించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఒక స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ తన సొంత ప్లాట్‌ఫామ్‌లోనే తన షేర్లను స్వయంగా లిస్ట్‌ చేసుకోవడం సాధ్యం కాదు. అందువల్ల ఎన్‌ఎస్‌ఈ తన షేర్లను సొంత మార్కెట్‌లో ట్రేడింగ్‌కు తీసుకురావాలంటే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) అనుమతి తప్పనిసరి. ఇదే అంశంపై ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

పీటీటీ మార్గం ఎలా పనిచేస్తుంది?

ఎన్‌ఎస్‌ఈ గత మే 7న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఒక కంపెనీ మరో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ప్రాథమికంగా లిస్టయి ఉంటే, దాని సెక్యూరిటీలను ఎన్‌ఎస్‌ఈలో ‘పర్మిటెడ్‌ టు ట్రేడ్‌’ కేటగిరీలో ట్రేడింగ్‌కు అనుమతించవచ్చు. అంటే ఆ కంపెనీ ఎన్‌ఎస్‌ఈలో ప్రత్యేకంగా లిస్టింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ ట్రేడింగ్‌ సదుపాయం పొందుతుంది.

పీటీటీ కేటగిరీలోకి వచ్చిన కంపెనీకి ఎన్‌ఎస్‌ఈతో ప్రత్యేక లిస్టింగ్‌ ఒప్పందం అవసరం ఉండదు. అలాగే ప్రాథమిక లిస్టింగ్‌ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించే ప్రస్తుత వెల్లడింపులే ప్రధానంగా వర్తిస్తాయి. అయితే ఎన్‌ఎస్‌ఈలో జరిగే ట్రేడింగ్‌ మాత్రం ఎక్స్ఛేంజ్‌ నిఘా, పర్యవేక్షణ నిబంధనలకు లోబడి ఉంటుంది.

ఎన్‌ఎస్‌ఈ ఐపీవోకు ఇది ఎందుకు కీలకం?

ఎన్‌ఎస్‌ఈ ఐపీవో ప్రక్రియ ఇప్పటికే కీలక దశకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ అధికారిక ఆఫర్‌ డాక్యుమెంట్ల ప్రకారం.. జూన్‌ 17, 2026న డీఆర్‌హెచ్‌పీ దాఖలైంది. ఆ తర్వాత ఆగస్టు 10న దానికి యాడెండమ్‌ కూడా జత చేశారు. ఐపీవోలో ఎన్‌ఎస్‌ఈ ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనుంది.

ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ షేర్లు బీఎస్‌ఈలో లిస్ట్‌ అయిన తర్వాత ఎన్‌ఎస్‌ఈ ప్లాట్‌ఫామ్‌పైనా ట్రేడింగ్‌కు అందుబాటులోకి వస్తే, పెట్టుబడిదారులకు మరో ట్రేడింగ్‌ వేదిక లభిస్తుంది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ సొంత షేర్లపై మార్కెట్‌ పర్యవేక్షణ, ధర నిర్ణయం, నియంత్రణ వంటి అంశాల్లో అదనపు జాగ్రత్తలు అవసరమవుతాయి.

ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈ పీటీటీ విధానాన్ని ఇతర లిస్టెడ్‌ కంపెనీలకు అందిస్తోంది. ఈ విధానం కింద ప్రాథమికంగా మరో ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన సంస్థలకు ఎన్‌ఎస్‌ఈలో అదనపు ట్రేడింగ్‌ వేదిక లభిస్తుంది. అందువల్ల ఎన్‌ఎస్‌ఈ తనకూ ఇదే వ్యవస్థను వర్తింపజేయాలని ప్రయత్నిస్తే, తుది నిర్ణయం మాత్రం సెబీ అనుమతిపైనే ఆధారపడి ఉంటుంది.

ఎన్‌ఎస్‌ఈ అధికారిక షేర్‌హోల్డింగ్‌ వివరాల ప్రకారం.. 2026 ఆగస్టు 4 నాటికి ట్రేడింగ్‌ మెంబర్లు, వారి అనుబంధ సంస్థలు, ఏజెంట్ల మొత్తం వాటా 35.17 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే, బీఎస్‌ఈలో ప్రాథమిక లిస్టింగ్‌.. ఎన్‌ఎస్‌ఈలో పీటీటీ ద్వారా ట్రేడింగ్‌ అనే నిర్మాణం అమలైతే, భారత స్టాక్‌ మార్కెట్‌లో ఒక ఆసక్తికరమైన కొత్త విధానానికి తెరలేచే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: వరుస నష్టాలకు బ్రేక్‌.. రయ్‌మన్న రియాల్టీ షేర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement