ఈ స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ఉంటే ఆఫీస్‌ పని అవ్వదు భారం! | Cheerdots 2 mouse Kingston ironkey vault privacy 80 ssd smart gadgets in office | Sakshi
Sakshi News home page

మ్యాజిక్‌ మౌస్‌.. డేటా గార్డ్‌.. ఈ స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ఉంటే ఆఫీస్‌ పని అవ్వదు భారం!

Jun 22 2025 5:50 PM | Updated on Jun 22 2025 5:50 PM

Cheerdots 2 mouse Kingston ironkey vault privacy 80 ssd smart gadgets in office

ఆఫీసు అంటేనే బోరింగ్‌గా, ఆఫీసు పని చాలా భారంగా అనిపిస్తోందా! అయితే, ఒక్కసారి ఈ టెక్‌ కొలీగ్స్‌ను కలవండి, అప్పుడు మీ ఆఫీస్‌ పని ఆటలాగా మారుతుంది.

మ్యాజిక్‌ మౌస్‌!
ఇప్పటి వరకు మౌస్‌ అంటే కేవలం క్లిక్‌లు కోసమే అనుకున్నారా? అయితే మీరు ఈ ‘చీర్‌డాట్స్‌ 2’ గురించి తెలుసుకోవాల్సిందే! ఇది ఒక మల్టీ టాలెంట్‌ కాంబినేషన్‌. ఎయిర్‌ మౌస్, టచ్‌ప్యాడ్, క్లికర్, ఏఐ చాట్, డేటా సమ్మరీ ఇచ్చే అడ్వైజర్‌ అన్నీ ఇదే! ఆఫీస్‌లో ప్రెజెంటేషన్‌ ఇచ్చేటప్పుడు స్క్రీన్‌ మీద దీనితో ఇలా ఊపేస్తే, అలా స్లైడ్స్‌ మారిపోతాయి. ఒక బటన్‌తో స్క్రీన్‌పై స్పాట్‌లైట్‌ వేసి అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. ఇంకా చెప్పాలంటే, మీరు మాట్లాడిన మాటలను ఈ మౌస్‌ ఏఐ సాయంతో రికార్డ్‌ చేసి, సింపుల్‌ సమ్మరీలుగా మార్చేస్తుంది. మొబైల్, బ్లూటూత్‌తో కనెక్ట్‌ చేసుకొని కూడా దీనిని వాడుకోవచ్చు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు ఇరవై రోజులు పాటు పనిచేస్తుంది. ధర 99 డాలర్లు (రూ. 8,475).

ట్రిపుల్‌ ట్రీట్‌ చార్జ్‌!
ఆఫీస్‌ అంటే ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, ఎయిర్‌పాడ్స్‌ వంటి చాలా రకాల ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌  రోజూ ఫుల్‌ చార్జ్‌ అవ్వాల్సిందే! కాని, ఒక్కోటి వేర్వేరు వైర్లు అడిగితే, ఆఫీస్‌లో మేనేజర్‌ కన్నా మనకే ఎక్కువ టెన్షన్‌! ఈ సమస్య తీర్చడానికే వచ్చింది ఈ ‘జీహూ క్యూబ్‌ ట్రిక్‌ ఎక్స్‌’. ఇది ఒక త్రీ ఇన్‌ వన్‌ చార్జర్‌. ఇది ఉంటే ఇక మీ డెస్క్‌ మీద ఒక్క కేబుల్‌ కూడా కనిపించదు. ఫోన్‌, వాచ్, ఎయిర్‌పాడ్స్‌ అన్నింటిని ఒకేచోట, ఒకేసారి చార్జ్‌ చేసుకోవచ్చు. ఇందులోని ఫాస్ట్‌ చార్జింగ్‌ ఆప్షన్‌ మిమ్మల్ని మరింత స్మార్ట్‌గా చేసేస్తుంది! ధర 55 డాలర్లు (రూ. 4,708)

డేటా గార్డ్‌
ఆఫీస్‌ ఫైల్స్‌ అంటే మామూలు విషయం కాదు, అవి ప్రమోషన్‌కి టికెట్‌ లాంటివి. ఒక్కసారైనా సిస్టమ్‌ సడన్‌గా క్రాష్‌ అయ్యిందంటే? అంతే సంగతులు. ఇక మీరు మీ కొత్త రెజ్యూమే రెడీ చేసుకోవాల్సిందే! పైగా హ్యాకర్లు, వైరస్‌లు, సాఫ్ట్‌వేర్‌ బగ్స్‌– అన్నీ డేటాపై పంజా విసురుతున్న ఈ రోజుల్లో  డిజిటల్‌ ఫైల్స్‌ను భద్రంగా ఉంచడం అంటే, ఫ్రిజ్‌లో పిల్లలకు కనిపించకుండా ఐస్‌క్రీమ్‌ దాచినంత కేర్‌ తీసుకోవాలి. అందుకే వచ్చింది ఈ ‘కింగ్‌స్టన్‌ ఐరన్‌ కీ వాల్ట్‌ ప్రైవసీ 80’. ఇది డ్రైవ్‌ కాదు, డేటాకు ఒక డిజిటల్‌ బౌన్సర్‌ లాంటిది. టచ్‌ స్క్రీన్‌తో, పాస్‌వర్డ్, పిన్‌లాంటి లాకింగ్‌ సిస్టమ్‌తో వస్తోంది.

ఏకంగా 3.8 టీబీ డేటా స్టోర్‌ చేసుకోవచ్చు. అంటే పదేళ్ల ఆఫీస్‌ ఫైల్స్, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్లు, పర్సనల్‌ ఫొటోలు, వీడియోలు అన్నీ ఇందులో భద్రంగా దాచుకోవచ్చు. ఒకే డ్రైవ్‌ను మల్టిపుల్‌ యూజర్లుగా వాడుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో పాస్‌వర్డ్‌ కూడా ఇవ్వవచ్చు. హ్యాకర్‌ ట్రై చేస్తే వెంటనే రిడ్‌–ఓన్లీ మోడ్‌ ఆన్‌ చేసి ‘బాబూ, కాస్త పక్కకు వెళ్లి ఆడుకోమ్మా!’ అంటూ అడ్డుపడుతుంది. అంత భద్రంగా డేటాను చూసుకుంటుంది. ధర 729 డాలర్లు (రూ. 62,422).  

Advertisement
 
Advertisement
Advertisement