
యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ సాఫ్ట్‌వేర్లలో అనేక లోపాల గురించి భారత ప్రభుత్వం వినియోగదారులను హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని సున్నితమైన యూజర్ డేటాను సైబర్ నేరస్థులు యాక్సెస్ చేసే వీలుందని, దాంతోపాటు వారి డివైజ్‌లను పూర్తిగా నిరుపయోగంగా మార్చే అవకాశం ఉందని తెలిపింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) ఈమేరకు యాపిల్ డివైజ్ యూజర్లకు హై-ఇంటెన్సిటీ హెచ్చరికలు జారీ చేసింది.
పాత, కొత్త మోడళ్లతో సహా వివిధ యాపిల్ పరికరాలపై ఈ లోపాలు ప్రభావం చూపుతాయని సీఈఆర్‌టీ-ఇన్ తెలిపింది. ఐఓఎస్ 18.3కు ముందు వెర్షన్లతో పనిచేసే ఐఫోన్లు, మోడల్‌ను బట్టి 17.7.3 లేదా 18.3 కంటే ముందు ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్లతో పనిచేసే ఐప్యాడ్లపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. యాపిల్ అంతర్గత మెసేజింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో కీలకమైన డార్విన్ నోటిఫికేషన్ సిస్టమ్‌లో ప్రధాన లోపాన్ని ఒకటి గుర్తించినట్లు తెలిపింది. దాని ప్రకారం ప్రత్యేక అనుమతులు లేకపోయినా ఏదైనా అప్లికేషన్ సిస్టమ్ స్థాయి నోటిఫికేషన్లను పంపేందుకు అది అనుమతిస్తుంది. దీన్ని దుర్వినియోగం చేస్తే డివైజ్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.
పరిణామాలు ఇలా..
ఈ లోపాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఈఆర్‌టీ-ఇన్ హెచ్చరించింది. హ్యాకర్లు వ్యక్తిగత, ఆర్థిక సమాచారంతో సహా గోప్యమైన డేటాను దొంగిలించే అవకాశం ఉంది. ఇంటర్నల్ భద్రతా యంత్రాంగాలను ఇది కట్టడి చేయవచ్చు. లేదా అనధికార కోడ్‌ను అమలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో యూజర్ల డివైజ్‌లు పూర్తిగా క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ లోపాలను అధిగమించేందుకు సత్వర చర్యలు అవసరమని సీఈఆర్‌టీ-ఇన్ ధ్రువీకరించింది.
ఇదీ చదవండి: పదేళ్ల తర్వాత గూగుల్ లోగోలో మార్పులు
వెంటనే యూజర్లు ఏం చేయాలంటే..
ఈ సమస్యకు పరిష్కారంగా యాపిల్ లోపాలను సరిదిద్దడానికి సెక్యూరిటీ అప్‌డేట్లను విడుదల చేసింది. యూజర్లందరూ తమ డివైజ్‌లను వెంటనే లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. లేటెస్ట్‌గా అందుబాటులో ఉన్న ఐఓఎస్ లేదా ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్‌కు అప్‌డేట్ అవ్వాలని తెలిపింది. వినియోగదారులు ధ్రువీకరించని మొబైల్ అప్లేకేషన్లను ఇన్‌స్టాల్ చేసుకోకూడదని పేర్కొంది. ఏపీకే ఫైల్ ద్వారా ఎలాంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోరాదని చెప్పింది. హానికరమైన కార్యకలాపాలను సూచించే పాప్‌అప్ సమాచారంపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.