లైసెన్సింగ్‌ సులభం చేద్దాం  | Centre plans to extend the validity of several licences to 15 years | Sakshi
Sakshi News home page

లైసెన్సింగ్‌ సులభం చేద్దాం 

Aug 21 2026 12:20 AM | Updated on Aug 21 2026 12:20 AM

Centre plans to extend the validity of several licences to 15 years

వ్యవధిని 15 ఏళ్ల వరకు పొడిగిద్దాం 

ఔషధాలు, ఎక్స్‌ప్లోజివ్స్‌పై కేంద్రం యోచన 

ఈ ఆర్థిక సంవత్సరంలో అమలయ్యే చాన్స్‌

న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలపై ఫోకస్‌ చేస్తోంది. ఇందులో భాగంగా పలు రంగాలపై లైసెన్సింగ్‌ భారాన్ని తగ్గించడం మీద కసరత్తు చేస్తోంది. కీలక పర్మిట్ల కాలవ్యవధిని 15 ఏళ్ల వరకు పొడిగించాలని భావిస్తోంది. దీన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేసే యోచన ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ప్రధానంగా పర్యావరణం, ఔషధాలు, పేలుడు పదార్థాలు, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ మొదలైన వాటికి సంబంధించి ఈ సంస్కరణలను ప్రవేశపెట్టొచ్చని పేర్కొన్నాయి. ‘నిజానికి పలు లైసెన్సులను పూర్తిగా తీసివేయాలని కూడా అనుకున్నప్పటికీ, అది సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. పోనీ వాటిని జీవితకాలానికి ఇవ్వడమనేది మరో ఆప్షనుగా తెరపైకి వచి్చంది. దాని మీద కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇలా జీవితకాల లైసెన్సులు ఇవ్వలేము కానీ, ఒక పది లేదా పదిహేనేళ్ల వరకు వ్యవధిని పొడిగించవచ్చని కొన్ని శాఖలు చెప్పాయి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.   

పర్మిట్ల కష్టాలు...
టూరిజం, హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి ఈ ఏడాది జూన్‌లో ప్రచురితమైన నీతి ఆయోగ్‌ రిపోర్టు  ప్రకారం ఫుడ్, బెవరేజ్‌ వ్యాపారాల విషయంలో ప్రాజెక్టు జీవితకాలంలో దాదాపు 30 లైసెన్సులు అవసరమవుతున్నాయి. ఆతిథ్య రంగ వ్యాపారాలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల నుంచి 60 లైసెన్సుల వరకు అవసరమవుతోంది. పర్యావరణ అనుమతులు మొదలుకుని ఫుడ్‌ సేఫ్టీ పర్మిట్ల వరకు తీసుకోవాలి. 

వీటిలో కొన్నింటిని నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత రెన్యువల్‌ చేసుకోవాలి. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను 1 ఏడాది నుంచి 5 ఏళ్లకోసారి రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటోంది. ఇదంతా  వ్యాపారాలకు సవాలుగా ఉంటోంది. 

పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ అనుమతులు, ఔషధాలకు తయారీ లైసెన్సులు, ఎక్స్‌ప్లోజివ్స్‌.. పెట్రోలియం సంబంధ కార్యకలాపాల కోసం పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ నుంచి సేఫ్టీ లైసెన్సులు, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండే ఉత్పత్తులకు బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ మొదలైనవి కావాలి.  ‘వివిధ రకాల లైసెన్సులన్నీ కలగలిపి ఒకే లైసెన్సు కింద మార్చే యోచన లేదు. తమ తమ వ్యాపార సంస్థలకు అవసరమయ్యే లైసెన్సులన్నింటినీ విడివిడిగా తీసుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం డీరెగ్యులేషన్, నిబంధనల భారాన్ని తగ్గించడంపైనే దృష్టి పెడుతున్నాం‘ అని అధికారి వివరించారు.  

అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సులు..
ఆర్థికయేతర నియంత్రణలకు సంబంధించిన సంస్కరణలపై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సులు చేసింది. నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలు, సరి్టఫికేషన్లు, లైసెన్సులు, పర్మిషన్లను సమీక్షించేందుకు 2025 ఆగస్టులో నీతి ఆయోగ్‌ సభ్యుడు, మాజీ క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా సారథ్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది. 

చాలా విషయాల్లో ప్రభుత్వ శాఖలన్నీ సుముఖంగానే ఉన్నందున డీరెగ్యులేషన్‌పై కమిటీ సిఫార్సులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ విధానంలో ఫీజు చెల్లింపు, లైసెన్సు కాలపరిమితి వేర్వేరు అంశాలుగా ఉంటాయన్నారు. వ్యాపార సంస్థలు నిర్దేశిత ఫీజును ఏటా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, లైసెన్సు కాలపరిమితి 10 లేదా 15 ఏళ్ల వరకు ఉంటుంది కాబట్టి పదే పదే రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement