
ఐటీ నియామకాలపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో క్యాప్ జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. భారత్‌లో ఈ ఏడాది 40,000-45,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 35-40 శాతం లేటరల్ నియామకాలు ఉంటాయని క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ తెలిపారు.
భారత్‌లో 1.75 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ దేశీయ కార్యకలాపాలపై మరింత దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన చెప్పారు. కంపెనీ కస్టమర్లు ఎక్కువగా ఖర్చు ఆదా, మరిన్ని అవకాశాలను కోరుతున్నట్లు తెలిపారు. ఈ ధోరణి భారత్‌లో మరింత వ్యాపారాన్ని అందిస్తుంది. సంస్థకు 50కి పైగా కళాశాలలు, క్యాంపస్‌లతో ఒప్పందాలు ఉన్నాయని, ప్రస్తుత సీజన్‌కు సంబంధించి నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త నియామకాలు అభ్యర్థుల కృత్రిమ మేధ ఆధారిత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు.
ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
డబ్ల్యుఎన్ఎస్‌తో విలీనం
ఇటీవల డబ్ల్యూఎన్ఎస్ కొనుగోలు క్యాప్‌జెమినీకి వ్యూహాత్మకంగా నిలుస్తుందని యార్డీ చెప్పారు. సొంత అవసరాల కోసం దేశీయంగా మూడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ ఎయిర్‌వేస్ డబ్ల్యూఎన్‌ఎస్‌ను నెలకొల్పింది. ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్(బీపీఎం) సంస్థను 330 కోట్ల డాలర్ల(సుమారు రూ. 28,250 కోట్లు) నగదు చెల్లింపు ద్వారా క్యాప్‌జెమిని సొంతం చేసుకోనుంది. ఒక్కో షేరుకీ 76.5 డాలర్లు చొప్పున ఆఫర్ చేసింది. ఈ రెండు కంపెనీలూ భారత్‌లో పటిష్ట కార్యకలాపాలు విస్తరించాయి. సంయుక్తంగా 2,00,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి.