
బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రిలయన్స్ కమ్యునికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్‌ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేయడం గమనార్హం.
రూ.3,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో పాటు కొన్ని కంపెనీలు కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జులై 24న ఈడీ అనిల్ గ్రూప్ కంపెనీలపై దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఢిల్లీ, ముంబైల్లో మూడు రోజుల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లు సహా 50 ఇతర కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. మరో 25 మంది కీలక హోదాల్లో ఉన్నవారిని ప్రశ్నించారు. అంతకుముందు అనిల్ అంబానీ కంపెనీలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెండు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసిన తరువాత ఈ దాడులు జరిగాయి.
యస్ బ్యాంక్ రుణాలు
2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది.
ఇదీ చదవండి: రిటైర్ అవుతున్నారా? అద్దె ఆదాయం కొంత వరకే!
‘ఫ్రాడ్’గా వర్గీకరణ
రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే రెండు కంపెనీలు జులై 26న స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈమేరకు దాడులకు సంబంధించిన విషయాలను ధ్రువీకరించాయి. ఈ దాడులు తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వాటాదారులు, ఉద్యోగులు లేదా మరే ఇతర వాటాదారులపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని తెలిపాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) సహా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను ఈడీతో పంచుకున్నాయి. అనిల్ అంబానీ, అంబానీల గ్రూప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్)ను ‘ఫ్రాడ్’గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వర్గీకరించింది.
