
పింఛను సదుపాయం ఏర్పాటు చేసుకున్న వారిని మినహాయిస్తే రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి స్థిరమైన ఆదాయం పెద్ద సవాలుగా మారుతుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరాస్తులు కొందరు ఇంటి అద్దె రూపంలో ఆదాయ మార్గంపై ఆధారపడుతుంటారు. కానీ ఇంటి అద్దె స్థిరమైనదని చెప్పలేం. కిరాయిదారు ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. కొత్త వారు రావడానికి కొంత సమయం పడితే అప్పటి వరకు అద్దె ఆదాయం ఉండదు.
ఇంటికి మరమ్మతులు, పన్నులు తదితర ఇతర నిర్వహణ వ్యయాల భారం మోయాల్సి ఉంటుంది. ఇల్లు పాతదవుతుంటే అద్దె పెరుగుదల ఆశించిన మేర ఉండదు. కరోనా సమయంలో చాలా మంది ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాల్లోనూ కిరాయిదారు అద్దెను సకాలంలో చెల్లించలేకపోవచ్చు. కొందరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇందులో రిస్క్ ఎక్కువ. కాబట్టి పెట్టుబడులపై స్థిరమైన ఆదాయానికి మార్గం చూడాలి.
పెట్టుబడి వృద్ధి చెందేలా..
పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనం కచ్చితంగా ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందేలా ఉండాలి. అలాంటప్పుడే నెలవారీ రాబడి మేర ఉపసంహరించుకున్నా కానీ, పెట్టుబడి విలువను స్థిరంగా కాపాడుకోవచ్చు. ఈక్విటీలు ఈ విషయంలో ఎంతో మెరుగైనవి. ఉదాహరణకు రూ.20 లక్షల మొత్తాన్ని 7 శాతం రాబడినిచ్చే డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఉపసంహరించుకున్నారనుకోండి. ఏడాది ముగిసిన తర్వాత రూ.18.92 లక్షల పెట్టుబడి మిగిలి ఉంటుంది. అంటే ఏడాదిలో రూ.3 లక్షలను ఉపసంహరించుకోవడంతో పెట్టుబడి సైతం రూ.1.08 లక్షలు తరిగింది.
ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’
ఇలాగే ఉపసంహరించుకుంటూ వెళితే 12 ఏళ్లకు ఆ పెట్టుబడి కరిగిపోతుంది. అదే ఈక్విటీల్లో అయితే 12% వరకు సగటు వార్షిక రాబడి ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉండే హైబ్రిడ్, సేవింగ్స్ ఫండ్స్‌లో అయితే 10% వరకు రాబడిని ఆశించొచ్చు. ఈ తరహా సాధనాలతో స్థిరమైన ఆదాయానికి తోడు పెట్టుబడినీ కాపాడుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. ఇదే రూ.20 లక్షలను 12% రాబడినిచ్చే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఉపసహరిస్తే 26 ఏళ్ల కాలానికి ఆ పెట్టుబడి స్థిర ఆదాయాన్నిస్తుంది. 10% రాబడి ప్రకారమైనా 17 ఏళ్ల పాటు ఆదాయాన్నిస్తుంది. వార్షిక రాబడి రేటులో మైనస్ 3% చొప్పున ఉపసంహరణకు పరిమితం కావడం వల్ల.. మిగిలిన 3% పెట్టుబడి వృద్ధికి చాన్సుంటుంది. దీంతో ద్రవ్యోల్బణం వల్ల పెరిగే జీవన వ్యయాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.