
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, వ్యవస్థలు మార్పుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ అన్నారు. లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఏఐ ఉత్పాదకతను పెంచే క్రమంలో చాలామంది సిబ్బంది తమ కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
ఏఐ వాడకం అనివార్యం
‘కృత్రిమ మేధ నేతృత్వంలోని ఆటోమేషన్ ఒక సానుకూల మార్పు. ఇది ప్రజలను, ఉద్యోగులను ఇతర మెరుగైన కొలువులు చేయడానికి సాయం చేస్తుంది. ఉత్పాదకతను మెరుగుపరిచే క్రమంలో ఏఐ వాడకం అనివార్యం అవుతుంది. కాబట్టి అందుకు అనువుగా మార్పులకు సిద్ధంగా ఉండాలి. లేదంటే సమస్యలు వస్తాయి. ఏఐ వేగంగా విస్తరిస్తోంది. అంత వేగంగా వచ్చే మార్పులకు సర్దుకుపోయే సమయం ఉండదనేదే ప్రశ్న’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంత వేగంగా అమలవుతున్నాయోనన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రోబోటిక్ ఆయుధాలు..
రాబోయే రోజుల్లో అనేక ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడిన తర్వాత భవిష్యత్తులో మాన్యువల్ లేబర్ తీవ్రంగా ప్రభావితం చెందుతుంది. ‘రోబోటిక్ ఆయుధాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. కానీ అవి అందుబాటులోకి వస్తే, శ్రామిక శక్తిని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి’ అని గేట్స్ చెప్పారు.
ఏజీఐతో ముప్పు
‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) ఆన్‌లైన్ సేల్స్ లేదా కస్టమర్ సర్వీస్ వంటి సంక్లిష్ట పనులను మానవుల కంటే మెరుగ్గా చేయగలదు. ఏజీఐ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాల ద్వారా సర్వీసు అందిస్తాయి. యంత్రాలు తక్కువ ఖర్చుతో మరింత కచ్చితత్వంతో పనులను నిర్వహించగలిగితే మాత్రం అది పెద్ద మార్పు అవుతుంది’ అని గేట్స్ తెలిపారు.
ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేదు?
కచ్చితమైన డేటా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎలా వాడుతున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..‘ఏఐ పురోగతిలో ఉన్న వేగం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కఠినమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఏఐ రీసెర్చ్ టూల్స్‌ను ఉపయోగిస్తాను. అయితే వాటిలోని అంశాలను ధ్రువీకరించేందుకు నిపుణులతో తరచూ తనిఖీ చేస్తాను. విచిత్రంగా వారుకూడా చాలాసార్లు అందులోని అంశాలు నిజమనే చెబుతారు’ అని అన్నారు.